Sep 15,2023 22:23

విజయనగరంకోట.. టిడిపి నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు

ప్రజాశక్తి-విజయనగరం కోట :  చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి నాయకులు చేపట్టిన నిరసన దీక్ష మూడోరోజు శుక్రవారం కూడా కొనసాగింది. స్థానిక అశోక్‌ బంగ్లా టిడిపి కార్యాలయం వద్ద నల్ల కండువాలు వేసుకొని నిరసన తెలిపారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఫెక్సీపై ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుని విడుదల చేసే వరకు ఈ నిరసన దీక్షలు కొనసాగుతాయని అన్నారు. మోసపూరితమైన కుట్ర అందులో భాగంగానే అరెస్ట్‌ చేశారని అన్నారు. రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్న పోలీసులు వైసిపి బైక్‌ ర్యాలీకి ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షులు వరప్రసాద్‌, కార్యదర్శి బంగారు బాబు, ధర్మరాజు, మండల పార్టీ అధ్యక్షులు బొద్దుల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, శ్రీనివాసరావు, రొంగల రామారావు, కర్రోతు నర్సింగరావు, వి.ప్రసాద్‌, కోదండరాం, రాజు, భారత్‌,, ఇతర టిడిపి నాయకులు పాల్గొన్నారు. బొబ్బిలి పట్టణంలో తెలుగు యువత చేపట్టిన సామూహిక నిరాహార దీక్షను టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయనతో కలిసి ఎమ్మెల్సీ చిరంజీవిరావు ప్రారంభించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు ప్రతీకారంగా ఓటుతోనే వైసిపికి బుద్ది చెప్పాలని ఎమ్మెల్సీ చిరంజీవిరావు కోరారు. చీపురుపల్లి మండల కేంద్రంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కిమిడి నాగార్జున అధ్యక్షన చేపట్టిన దీక్షలో శుక్రవారం మెరకముడిదాం మండల నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ అభిమాని శిబిరం వద్దే అరగుండు చేయించుకుని ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశాడు. దీక్షలో నాయకులు తాడ్డి సన్యాసినాయుడు, కెంగువ ధనుంజరు, మండల రమణమోహన్‌రావు, పెందుర్తి సింహాచలం, తదితరులు పాల్గొన్నారు. శృంగవరపుకోట పట్టణంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ఆధ్వర్యాన మూడో రోజు దీక్షలు కొనసాగాయి. ధార గంగమ్మ ఫంక్షన్‌ హాలు వద్ద నియోజకవర్గ ఇన్చార్జి కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యాన దీక్ష చేపట్టారు. ఈ శిబిరాలను సిపిఐ నాయకులు పి.కామేశ్వరరావు, మద్ది కష్ణ, మోపాడ మధు సందర్శించి, మద్దతు తెలిపారు.
ప్రజలే బుద్ధి చెప్తారు
మాజీ ఎమ్మెల్యే గీత

విజయనగరంకోట : రానున్న రోజుల్లో ప్రజలే వైసిపి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని మాజీ ఎమ్మెల్యే మీసాలగీత అన్నారు. శుక్రవారం 'బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితలమ్మను దర్శించుకొని చంద్రబాబు నాయుడు క్షేమంగా బయటకు రావాలని, నూటొక్క కొబ్బరికాయ కొట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కక్షపూరిత వైసిపి ప్రభుత్వం అంతం అవ్వాలని, తమ అధినేత త్వరగా ఈ అభియోగాల నుండి బయటకు రావాలని కోరారు. వైసిపి నాయకులకు 144 సెక్షన్‌ వర్తించదా అని ప్రశ్నించారు. అనంతరం మూడులంతర్ల దగ్గర గల జామియా మసీదులో ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి మాజీ సభ్యులు తుంపిల్లి రమణ, మండల మాజీ ప్రధాన కార్యదర్శి దాట్ల రవి రాజు , రాష్ట్ర పద్మశాలి కన్వీనర్‌ దేవేంద్రనాథ్‌ , మాజీ కౌన్సిలర్లు కెల్ల సూరిబాబు, సుంకరి విజయలక్ష్మి , కిలాన మహేష్‌ , గోగుల ప్రణయి, రాజు, తదితరులు పాల్గొన్నారు.