ప్రజాశక్తి-విజయనగరంకోట, గరివిడి : చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా టిడిపి ఆధ్వర్యాన జిల్లా కేంద్రంలో 'బాబుతో నేను' కార్యక్రమం తలపెట్టిన నేపథ్యంలో శనివారం వేకువ జామునుంచే టిడిపి నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. శాంతి ర్యాలీకి ముందుగా పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నప్పటికీ నిర్బంధం విధించడం అన్యాయమని టిడిపి నాయకులు అన్నారు. విజయనగరంలోని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కెఎ నాయుడు ఇంటి వద్ద పోలీసులు మోహరించి ఆయనను ఇంటి నుంచి బయటకు రాకుండా చేశారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, నగర అధ్యక్షులు ప్రసాదుల ప్రసాద్ లక్ష్మీ వరప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కర్రోతు నర్సింగరావు తదితరులను హౌస్ అరెస్టు చేశారు.

విజయనగరం పార్లమెంటరీ స్థానం అధ్యక్షులు కిమిడి నాగార్జునను చీపురుపల్లిలో గహ నిర్బంధం చేశారు. నిరసనకు తాము అనుమతి తీసుకున్నామని, ఇలా నిర్బంధించడం సరికాదని నాగార్జున చెప్పినప్పటికీ పోలీసులు అంగీకరించలేదు. దీంతో ఆయన జిల్లా ఎస్‌ఫి కార్యాలయానికి వెళ్లి, అక్కడే అడుగుతానని, హౌస్ అరెస్ట్ చేయటం ఏ చట్టం లో ఉందంటూ నిలదీశారు. సెక్షన్ 144, 30 అమలులో ఉన్నాయి అంటున్నందున తాను ఒక్కడినే నడుచుకుంటూ వెళ్తానని అక్కడ నుంచి పాదయాత్రగా బయల్దేరారు. కొంత దూరం వచ్చిన తర్వాత.. మార్గమధ్యలో డిఎస్‌పి చక్రవర్తి ఆయన వద్దకు చేరుకొని తన వాహనంలో ఎస్‌పి కార్యాలయానికి తీసుకెళ్తానని.. సహకరించాలని కోరారు. దీంతో జిల్లా ఎస్‌పి కార్యాలయానికి నాగార్జునను పోలీసులు తీసుకెళ్లారు.
అంతకుముందు నాగార్జున విలేకర్లతో మాట్లాడుతూ మంత్రి బొత్స సత్యనారాయణ గతం మరిచి, ప్రజలను మభ్యపెట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ అంటూ సత్తిబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యమంటే ఆయనకు ఎక్కడ గౌరవం ఉందని ప్రశ్నించారు. మొన్నటి సారి విజయనగరం జిల్లా పరిషత్తు స్థానం ఎస్‌సి మహిళకు కేటాయిస్తే ఆయన కుటుంబ సభ్యుడి కోసం రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్‌ను మార్చలేదా? కుటుంబ సభ్యుడి మెడికల్ సీటును ఒక కళాశాల నుంచి మరో కళాశాలకు మార్చేందుకు రాత్రికి రాత్రే జీవో ఇచ్చిన మాట వాస్తవం కాదా?, మద్యం సిండికేట్లను మీరు నడపలేదా?'' అని ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెట్టి, రాజకీయంగా చంద్రబాబును దెబ్బ కొట్టాలని చూసినందుకే తాము కోర్టులకు వెళ్లామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సారేపాక సురేష్ బాబు, మండల చంటి, విసినిగిరి శ్రీనివాసరావు, మహంతి అప్పలనాయుడు, పిన్నింటి సన్యాసినాయుడు, మీసాల శ్రీధర్ నాయుడు, మండల అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
దీక్షలకు టిడిపి లీగల్ సెల్ మద్దతు
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అశోక్‌బంగ్లా వద్ద కొనసాగుతున్న నిరసన దీక్షలో శనివారం ఆ పార్టీ లీగల్‌సెల్ నాయకులు పాల్గొన్నారు. లీగల్ సెల్ సభ్యులు కరణం సూర్యతేజ , యువి రాజేష్, అర్జి అప్పలరాజు, పివి వరలక్ష్మి, జి.రామాంజనేయులు, జి.రాంబాబు, మర్రి రవి కుమార్, కె.మల్లేశ్వర రావు, జి.మధు సూదనరావు దీక్షలో పాల్గొన్నారు. జనసేన నుంచి సనకా సుబ్రమణ్యం మద్దతు తెలిపారు.










