Sep 29,2023 22:17

ఫొటో : మాట్లాడుతున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

టిడిపి నాయకుల భారీ ర్యాలీ
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ (చేజర్ల) : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టుకు నిరసనగా టిడిపి నాయకులు మండల కేంద్రమైన చేజర్లలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. చేజర్లలోని బస్టాండ్‌ నుంచి రిలే నిరాహార దీక్ష వేదిక వరకు ఈ ర్యాలీ సాగింది. మార్గం మధ్యలో ఎన్‌టిఆర్‌, అంబేద్కర్‌, గాంధీజీ విగ్రహాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. ర్యాలీ ముగించుకుని రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. రిలే నిరాహార దీక్షలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మాట్లాడుతూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సక్రమంగా జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి నియమించిన చైర్మన్‌ పేర్కొన్నారని తెలిపారు.
వెంకటగిరి ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ గతంలో నిరసనలు అందరికీ ఆమోదయోగ్యమైన పంచాయతీ బస్టాండు, బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే వాళ్లమని తెలిపారు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో పార్టీ నాయకుల, అభిమానుల స్థలాల్లో నిర్వహించుకోవాల్సి వస్తుందన్నారు. నెల్లూరు రూరల్‌ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ చిన్నచిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు అందడం లేదన్నారు. అయితే పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు వెంటనే వచ్చేస్తున్నాయన్నారు. పెద్ద కాంట్రాక్టర్లు పార్టీ వైపు చూస్తారు కాబట్టి వారికి తొందరగా బిల్లులు మంజూరవుతున్నాయని తెలిపారు. వెంకటగిరి మాజీ ఎంఎల్‌ఎ కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారన్నారు. దానికి సాక్షాలు గానీ, ఎఫ్‌ఐఆర్‌ గానీ లేదన్నారు. చంద్రబాబు, లోకేష్‌ పాదయాత్రలను చూసి ఓర్వలేక దురుద్దేశంతో అరెస్టు చేశారన్నారు. చంద్రబాబు ఎప్పుడూ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం పాటుపడ్డారని తెలిపారు. మాజీ ఎంపి పనబాక లక్ష్మి మాట్లాడుతూ వైసిపి నాయకులు దొంగ ఓట్లను చేర్చడం, టిడిపి సానుభూతిపరుల ఓట్లను తీసేయడం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో గూడూరు మాజీ ఎంఎల్‌ఎ పాశం సునీల్‌ కుమార్‌, చెంచలబాబు యాదవ్‌, ఆనం రంగమయూర్‌ రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ కంభం విజయరామిరెడ్డి, చేజర్ల మండల టిడిపి సీనియర్‌ నాయకులు రావి లక్ష్మీ నర్సారెడ్డి, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి నలిశెట్టి శ్రీధర్‌, వేలూరు కేశవ చౌదరి, మోదేపల్లి నవకృష్ణ చౌదరి, రావి పెంచలరెడ్డి, మోదేపల్లి పెంచలనాయుడు, అచ్చాల నారాయణరెడ్డి, చీర్ల వెంకటేశ్వర్‌ రెడ్డి, చెట్ల వెంకటయ్య, ఆముదం భగవాన్‌ రెడ్డి, గుత్తా హజరత్‌ నాయుడు, కొన్ని వెంకటేశ్వర్లు, గొర్ల పెంచల నారాయణరెడ్డి, సుధాకర్‌ రెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.