Sep 03,2023 22:18

భగుబండ వద్ద పోలీస్‌ వాహనాన్ని అడ్డగించిన నాగేంద్ర భార్య

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : పెదకూరపాడు నియోజకవర్గానికి చెందిన టిడిపి నాయకుడు దండా నాగేంద్రను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకుని వేధింపులకు గురిచేస్తున్నట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు. అమరావతి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు సాగుతున్న వైనంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో అమరావతి మండలం ధరణి కోటకు చెందిన నాగేంద్ర కేసు దాఖలు చేశారు. ఇసుక తవ్వకాల్లో అక్రమాలు నిర్థారణ కావడంతో రాష్ట్రంలో తవ్వకాలపై నిషేధం విధించడంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా విధించారు. ఈ నేపథ్యంలో నాగేంద్రపై అట్రాసిటీ కేసులు పెట్టారని కుటుంబ సభ్యుల ఆరోపించారు. ఇసుక ర్యాంప్‌లలో డ్రోన్‌ ఎగురవేశారని పోలీసులు కేసునమోదు చేశారని తెలిపారు. అమరావతి నుంచి సత్తెనపల్లి, ముప్పాళ్ల తదితర పోలీసు స్టేషన్‌ల చుట్టూ తిప్పుతూ హింసిస్తుండగా నాగేంద్ర బంధువులు, భార్య భృగుబండ వద్ద పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. నాగేంద్ర భార్య పోలీసు వాహనానికి అడ్డుగా కూర్చొని నిరసన తెలిపారు. ఆమెను పక్కకు తొలగించి వాహనం ముందుకు వెళ్లింది. అమరావతికి చెందిన దండా నాగేంద్ర అరెస్ట్‌ను మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఖండించారు. రాష్ట్రంలో రూ.40 వేల కోట్లు ఇసుక అక్రమ మైనింగ్‌ జరిగిందన్నారు. ఎన్‌జిటి తీర్పునకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేస్తున్న వైసిపి నాయకులు ఫిర్యాదు చేసిన వారిపై తప్పుడు కేసులు పెట్టడం ఏమిటని మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. దండా నాగేంద్రను వెంటనే విడుదల చేయాలని, అతనికి ఏమైనా జరిగితే ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, పోలీసు అధికారులు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.