ప్రజాశక్తి-అద్దంకి: పట్టణంలోని నాగులపాడు రోడ్డులో కామేపల్లి కళ్యాణ మండపంలో రామాయపాలెం, తిమ్మాయపాలెం, కొటికలపూడి, కుంకుబాడు, మోదేపల్లి, పేరాయపాలెం, ధేనువకొండ గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి మినీ మేనిఫెస్టోలోని అంశాలను వివరించాలని నేతలకు సూచించారు, ఈ సందర్భంగా ధేనువకొండ, కొటికలపూడి, రామాయపాలెం గ్రామాల నేతలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ పై నుంచి వరద జలాలు వస్తే ఏంచేయాలో ఒక ప్రణాళిక రూపొందించడంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల గేటు కొట్టుకునిపోయి నీరు సముద్రం పాలయింది. వైసిపి నేతలు ఇసుక దోపిడీ కారణంగానే నేటికీ గేట్ల మరమ్మతులకు నోచుకోలేదనే అనుమానం కలుగుతోందన్నారు. దశాబ్ద కాలం గడవకముందే ప్రాజెక్టులోని కీలకమైన గేట్లు తుప్పు పట్టిపోవడం చూస్తుంటే నేటి ప్రభుత్వ పనితీరుకు నిలువుటద్దంలా కనిపిస్తోందని అన్నారు. రెండు సంవత్సరాల క్రితమే జలవనరుల శాఖ అధికారులు గుండ్లకమ్మ జలాశయంలోని మొత్తం 15 గేట్లకుగాను 10 గేట్లకు మరమ్మతులు అవసరమని గుర్తించి దాదాపు 3 కోట్ల రూపాయల అంచనాలు సిద్ధంచేసి పై అధికారులకు నివేదికను సమర్పించినా నిధుల కేటాయింపులో నిర్లక్ష్య ధోరణి అవలంబించడమే నేటి ఈ దుస్థికి కారణమని ఆయన తెలిపారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ధేనువకొండ గ్రామంలోని చెరువును అభివృద్ధి చేసి లిఫ్ట్ ద్వారా దిగువ పొలాలకు నీరు అందిస్తామని చెప్పారు. రాకపోకలకు అనువుగా గ్రామానికి అనుసంధానం చేస్తూ నూతన రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల గొంతునొక్కడం, సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాల్లా మార్చిన చరిత్ర వైసిపిదని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం సర్పంచ్‌ల డబ్బులు రూ.8,548.29 కోట్లు కొల్లగొట్టడంతో ఛీత్కరించుకుంటున్నారని అన్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తూ, గ్రామసర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా జగన్‌రెడ్డి మార్చారని విమర్శించారు. పల్లెలను అభివృద్ధికి దూరంగా, అనారోగ్యానికి ఆలవాలంగా మార్చారని అన్నారు. సర్పంచ్ స్థానాలు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు తమపై, తమ ప్రభుత్వంపై ఉన్న అభిమానంతో వైసీపీకి ఏకగ్రీవమయ్యాయని చెప్పుకున్నవారంతా, ఇప్పుడు జరుగుతున్నదానిని చూసి సిగ్గుపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. పంచాయతీ నిధులు మింగిన జగన్ సర్కార్‌ని పల్లె ప్రజలే గద్దె దించి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఇన్‌ఛార్జులు పాల్గొన్నారు.










