Sep 09,2023 23:46

ప్రజాశక్తి - పంగులూరు
టిడిపి అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్టు చేసి తీసుకెళుతున్న కాన్వాయ్ కి ముప్పవరం వద్ద జాతీయ రహదారిపై టిడిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. ముప్పవరం దగ్గర ఉన్న టిడిపి కార్యాలయం సమీపంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ సంఘటనలో పంగులూరు గ్రామానికి చెందిన వీరాంజనేయులు అనే టిడిపి కార్యకర్తకు తల పగిలింది. చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేసిన పోలీసులు ఒంగోలు వైపు నుండి ముప్పవరం మీదుగా జాతీయ రహదారిపై విజయవాడ తీసుకెళ్తారని తెలుసుకున్న టిడిపి కార్యకర్తలు ఉదయం ఎనిమిది గంటల నుండి ముప్పవరం సమీపంలో ఉన్న టిడిపి కార్యాలయం వద్దకు రావటం మొదలుపెట్టారు. 11గంటల సమయంలో భారీగా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబును తీసుకెళుతున్న కాన్వాయి దగ్గరికి రావడంతో కార్యకర్తలు కాన్వాయ్ కి అడ్డుగా నిలబడి జై చంద్రబాబు, జై జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో పోలీసులు, కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది. ఒక దశలో పోలీసులపై కార్యకర్తలు ఎదురు తిరగడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. కార్యకర్తలను చెల్లాచెదురు చేశారు. పోలీసుల లాఠీలకు కార్యకర్తలు పరుగులు తీశారు. ఈ లాఠీ చార్జీలో పంగులూరుకు చెందిన వీరాంజనేయులు అనే కార్యకర్తకు తలకు బలమైన గాయం తగిలి రక్తం కారింది. తగిలిన గాయంతో కారిన రక్తాన్ని చంద్రబాబు దగ్గరకు వెళ్లి ఆయనకు చూపించాడు. అయితే పోలీసులు హడావిడిగా చంద్రబాబు ఉన్న కాన్వయిని తీసుకుపోయారు.