ప్రజాశక్తి, - భట్టిప్రోలు
టిడిపి రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబాపై వైసిపి నాయకులు దాడికి తెగబడ్డారు. దీంతో టిడిపి వర్గీయులు సుమారు ఐదు గంటల పాటు ధర్నా, రాస్తా రోకోలు చేపట్టారు. చంద్రబాబు అరెస్టును నేపధ్యంలో పోలీసులు సాయిబాబును గృహనిర్భంధం చేశారు. ఆయనకు కాపలాగా ఏఎస్ఐ, ఇరువురు కానిస్టేబుల్‌లను నియమించారు. పోలీసుల సమక్షంలో గ్రామానికి చెందిన నలుగురు వైసిపి నాయకులు ఇంటిలోకి ప్రవేశించి తనపై దాడి చేశారని సాయిబాబు చిరిగిన బట్టలు, గాయాలతో రోడ్డెక్కారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన సాయిబాబుపై దాడి జరిగిన సమాచారం తెలుసుకున్న ఆ సామాజిక వర్గ దుకాణదారులు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. ఆయనకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. దీంతో రెండు గంటలపాటు రథం సెంటర్, మరో రెండు గంటల పాటు బస్టాండ్ సెంటర్లో పెద్ద ఎత్తున టిడిపి నాయకులు రాస్తారోకో నిర్వహించారు. రేపల్లె డిఎస్పి చొరవతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించి నిందితులపై ఫిర్యాదు చేయించారు. ఇదిలా ఉండగా సాయిబాబా తమపై దాడి చేశారంటూ వైసీపీ నాయకులు అరుణశాస్త్రి, సలీం, కోటేశ్వరరావు, శ్రీనివాసరావు ముందుగానే పోలీస్ స్టేషన్‌కు రావడంతో పోలీసులు స్వయంగా పోలీస్ జీవుతో రేపల్లె వైద్యశాలకు తరలించటం చర్చగా మారింది. దాడి చేసిన వ్యక్తులను పోలీసులే జీబులో వైద్యశాలకు పంపించడం, పోలీసుల సమక్షంలోనే సాయిబాబాపై అదే నలుగురు దాడి చేయడం హేయమైన చర్యని విచారించి న్యాయం చేయాలంటూ సాయిబాబా డిమాండ్ చేశారు.










