Oct 28,2023 21:22

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రాబోయే ఎన్నికల్లో టిడిపి-జనసేన కూటమి విజయం ఖాయమని పలువురు టిడిపి నాయకులు అభిప్రాయపడ్డారు. స్థానిక హోటల్‌ జగదీశ్వరిలో అర్బన్‌ నియోజకవర్గ విస్త్రృత స్థాయి సమావేశం టిడిపి నగర అధ్యక్షుడు రెడ్డి మణేశ్వరరావు అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, గన్ని కృష్ణ, ఆదిరెడి వాసు, నియోజకవర్గ పరిశీలకురాలు చిల్లా జగదీశ్వరి మాట్లాడారు. జగన్‌ పాలనలో రాష్ట్రంలో హింస, అరాచకం చూస్తున్న ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలన్నది ఇప్పటి ఒక నిర్ణయానికి వచ్చేసారని తెలిపారు. ఎన్‌టిఆర్‌ తెలుగు ప్రజలకు ఆత్మగౌరవం తీసుకొస్తే, చంద్రబాబు ఆత్మ విశ్వాసం తెచ్చారని అన్నారు. చంద్రబాబు ప్రజల కోసం పోరాడే నాయకుడని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసమే నిరంతరం పరితపించడం చంద్రబాబు చేసిన తప్పా? అని ప్రశ్నించారు. 48 ఏళ్లుగా రాష్ట్రం కోసం కష్టపడడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు తీసుకురావడం, ఐటీ రంగాన్ని, అమరావతిని రాజధానిగా అభివద్ధి చేయడం తప్పా? వీటిలో ఆయన చేసిన తప్పులేంటో చెప్పాలన్నారు. ఏ తప్పు చేయని తమ నాయకుడు చంద్రబాబు త్వరలోనే జైలు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పటికీ ప్రజలకు ధైర్యం చెప్పేందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్రజల్లో తిరుగుతున్నారని, మనమంతా అండగా ఉండాలన్నారు. రాష్ట్రంలో సైకో పాలనకు చరమగీతం పాడేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి-జనసేన కూటమి విజయకేతనం ఎగురవేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు యర్రా వేణు, వర్రే శ్రీనివాసరావు, రెడ్డి రాజు, దొండపాటి సత్యంబాబు, తదితరులు పాల్గొన్నారు.