Nov 20,2023 22:43

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి రాజమండ్రి సెంట్రల్‌ జైలు వద్ద టిడిపి, జనసేన పొత్తు కుదిరిన నేపథ్యంలో రెండు పార్టీల నేతలు కలిసి ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. అధికార వైసిపిని ఏదో ఒక రకంగా ఓడించాలనే ఆలోచనలో వీరున్నారు. ఈ తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఆత్మీయ కలయిక పేరుతో సమావేశాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. కాకినాడ జిల్లాలో ఇటీవల జరిగిన పిఠాపురం, జగ్గంపేట నియోజకవర్గాల సమావేశాల్లో టిడిపి, జనసేన మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సీట్ల సర్దుబాటు అంశంపై ఇంకా స్పష్టత రాకపోయినా రెండు పార్టీల నేతలు ఎంఎల్‌ఎ టికెట్‌ నాది అంటే నాది అన్నట్లుగా వ్యవహరుస్తున్నాయి. అందుకు అనుగుణంగా కార్యకర్తలను సిద్ధం చేసి సమావేశాలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో మాటకు మాట పెరిగి 'ఆత్మీయ కలయిక ' వేదికగా బాహాబాహీకి దిగుతున్నారు.
జగ్గంపేటలో ఘర్షణ
జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లిలో ఇటీవల జరిగిన ఆత్మీయ సమావేశంలో టిడిపి, జనసేన నాయకుల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సమావేశం జరుగుతుండగానే రెండు పార్టీల నేతలు బాహాబాహీకి దిగారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంఎల్‌ఎ జ్యోతుల నెహ్రూ, ఆ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ కుమార్‌ సమక్షంలోనే కార్యకర్తలు తోపులాటకు దిగారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల గోకవరంలో జరిగిన ఒక కార్యక్రమంలో రెండు పార్టీల కార్యకర్తల గొడవకు దిగారు. దీంతో ఒక జనసేన కార్యకర్త కాలు విరగడంతో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ పాఠంశెట్టి సూర్యచంద్ర టిడిపి నేతలు క్షమాపణ చెప్పాల్సిందిగా సమావేశంలో డిమాండ్‌ చేస్తూ బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఆత్మీయ సమావేశం రచ్చరచ్చగా మారింది. కూర్చుని మాట్లాదాం అని నెహ్రూ చెప్పినప్పటికీ వినిపించుకోని జనసైనికులు ఒకడుగు ముందుకేసి నిలదీసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో నవీన్‌ కుమార్‌ వైపు గొడవకు వెళుతున్న వారిని అక్కడున్న టిడిపి కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. దీంతో కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం జరిగిన ఇదే సమావేశంలో పొత్తులో భాగంగా సీటు తనదేనని జ్యోతుల నెహ్రూ చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. పవన్‌ కల్యాణ్‌ కూడా తనవైపే ఉన్నారని, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ సూర్యచంద్రకు సీటు ఇస్తే పొత్తులో ఉండనంటూ జ్యోతుల స్పష్టం చేయడంతో జనసేన కార్యకర్తలు సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. తన 25 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి వివాదం ఎప్పుడూ చూడలేదని నెహ్రూ ఘాటు వాఖ్యలు చేశారు. జనసేన కార్యకర్తలకు కావాలనే వివాదాన్ని సష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగ్గంపేట నుంచి తానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. సూర్యచంద్రకు టిక్కెట్‌ ఇస్తే కలిసి పని చేసేది లేదని స్పష్టం చేశారు. సూర్యచంద్రకు తప్ప జనసేన టికెట్‌ ఎవరికి ఇచ్చినా తాను ఎన్నికల్లో కలిసి పనిచేస్తానని తెలిపారు.
పిఠాపురంలో ఘర్షణ వాతావరణం
ఉమ్మడి మేనిఫెస్టోతో ముందుకు వెళ్తామని ప్రకటించిన టిడిపి, జనసే క్షేత్రస్థాయిలో సమన్వయంతో ముందుకు సాగలేకపోతున్నాయి. పిఠాపురంలో ఇటీవల నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న వివాదమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ సమావేశంలో రెండు పార్టీల మధ్య ఉన్న విభేదాలు బయటపడడంతో కొందరు కార్యకర్తలు ముక్కున వేలేసుకున్నారు. సమావేశం గందరగోళంగా మారడంతో సమన్వయం ఆదిలోనే కొరవడిందనే విమర్శలు ఈ సందర్భంగా వినిపించాయి. నియోజకవర్గాన్ని ఎంత అభివద్ధి చేసినా 2019 ఎన్నికల్లో వర్మ ఓడిపోవడంతో భవిష్యత్తు ఎన్నికల్లో మరింత కష్టపడి పని చేయాలని జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి తంగెళ్ల ఉదరు శ్రీనివాస్‌ అన్నారు. గత ఎన్నికల్లో వర్మ ఓడిపోయిన నేపథ్యంలో ఈసారి సీటు తనకు ఇవ్వాలని ఉదరు శ్రీనివాస్‌ పరోక్షంగా అనడంతో టిడిపి నేతలు అసంతప్తి వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన వర్మ మాట్లాడుతూ శ్రీనివాస్‌కు క్లారిటీ లేదని, తనకు 70 వేల ఓట్లు పడ్డాయని గుర్తు చేశారు. నేనొక్కడినే కాదని అతిరథ మహా మహులే ఓడిపోయారని చెప్పుకొచ్చారు. అయితే వర్మ పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసారని జన సైనికులు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ కళ్యాణ్‌ అవమానించేలా మాట్లాడుతున్నారని నినాదాలు చేశారు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాతావరణం ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరికొకరు దూషణలు చేసుకున్నారు. ఒక సందర్భంలో కుర్చీలు విసిరేసుకుంటూ బాహాబాహీకి దిగేంత పని చేశారు. ఇరు పార్టీల కార్యకర్తలకు నాయకులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. చివరకు జనసేన నాయకులు, కార్యకర్తలు అక్కడ నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. ఇలా రెండు పార్టీల మధ్య సఖ్యత లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో ఎలా కలిసి పని చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.