
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రాష్ట్రంలో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి-జనసేన కూటమి అధికారంలోకి రావడం తధ్యమని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆదిరెడ్డి శ్రీనివాస్ తన పుట్టిన వేడుకలకు దూరంగా ఉంటూ వైసిపి ప్రభుత్వ తీరును నిరసిస్తూ గురువారం సంఘీభావ దీక్ష నిర్వహించారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన అభిమానులు తెచ్చిన బొకేలు, పుష్పమాలలు సున్నితంగా తిరస్కరించిన ఆయన ఎన్‌టిఆర్ విగ్రహానికి అలంకరించాల్సిందిగా కోరారు. ఈ దీక్షకు అర్బన్ ఎంఎల్‌ఎ ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎంఎల్‌ఎ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎంఎల్‌సి, జనసేన పార్టీ నాయకులు కందుల దుర్గేష్, అనుశ్రీ సత్యనారాయణ, వై.శ్రీను, టిడిపి రాజానగరం ఇన్‌ఛార్జ్‌్ బొడ్డు.వెంకట రమణ చౌదరి, తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా టిడిపి-జనసేన పార్టీల కుటమి ప్రభుత్వాన్ని అడ్డుకోలేరని అన్నారు. రాజమహేంద్రవరం నగరంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని, సెక్షన్ 30, 144 అమలులో ఉంటే వైసిపి నాయకులు మాత్రం చంద్రబాబు నాయుడి ఫ్లెక్సీలను దహనం చేస్తారని, అదే తాము నిరసన వ్యక్తం చేస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తారని అన్నారు. చంద్రబాబు ఫ్లెక్సీ దహనం చేసిన వారిపై ఇప్పటికే త్రీ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, వారిపై చర్యలు తీసుకునే వరకూ తమ పోరాటం ఆగదన్నారు. అధికార పార్టీ వాళ్లు ఇష్జారాజ్యంగా ప్లెక్సీలు ఏర్పాటు చేసుకున్న పట్టించుకోని నగర పాలక సంస్థ అధికారులు తమ ఫ్లెక్సీలను తొలగించడం సరికాదన్నారు. వైసిపి ప్రభుత్వానికి కేవలం నాలుగు నెలలు మాత్రమే సమయం ఉందని అధికార యంత్రాంగం గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.