* ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం
* జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ
ప్రజాశక్తి - రణస్థలం: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు భూస్థాపితం కావడం ఖాయమని రాష్ట్ర విద్యాశాఖ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికల తర్వాత ఆ పార్టీలు దుకాణం సర్దుకోవాల్సిందేనన్నారు. మండల కేంద్రంలో గడప గడపకు మన ప్రభుత్వం విజయోత్సవ సభను ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 ఏళ్ల పాటు పరిపాలించిన చంద్రబాబు నాయుడు ఒక్కసారైనా వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో కొన్నింటినైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలతో డబ్బులను వృథా చేస్తున్నారని గగ్గోలు పెట్టిన ఆయన, అవే పథకాలను తామూ అమలు చేస్తామని చెప్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఒకవైపు తండ్రి, మరోవైపు కొడుకు లోకేష్, ఇంకోవైపు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ తిరుగుతూ అర్థం పర్థం లేని ప్రసంగాలు చేస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ పిచ్చి ప్రేలాపనలతో ప్రజలకు మరింత దూరమవుతున్నారే గానీ, దగ్గర కాలేకపోతున్నారని చెప్పారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి గానీ నోరు పారేసుకుంటే ప్రజల్లో గౌరవం దెబ్బతింటుందని హితవు పలికారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారికి అందిన సంక్షేమాన్ని వివరించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే గడప గడపకు మన ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంతో పాటు ఇవ్వని మరెన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను అదుకున్నారని కొనియాడారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని కోరారు.
శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్లుగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సంక్షేమ కేలండర్‌ను విడుదల చేసి తూచ తప్పకుండా నిర్దేశించిన తేదీకే బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోందని చెప్పారు. రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ రూ.631 కోట్లతో బుడగట్లపాలెం వద్ద హార్బర్, హిరమండలం వద్ద ఎత్తిపోతల పథకం, మూలపేట పోర్టుతో జిల్లా రూపురేఖలు మారనున్నాయన్నారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకే పథకాలు అందించిన ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో వంద గ్రామ సచివాలయల పరిధిలోని 93,047 కుటుంబాలను సందర్శించి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. సభలో వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, నియోజకవర్గ పరిశీలకులు ఎన్.నాయుడు బాబు, కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, నియోజకవర్గంలోని నాలుగు మండలాల ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, అధికారులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










