Nov 18,2023 00:12

ప్రజాశక్తి - భట్టిప్రోలు
వేమూరులోని చిన్నబ్బాయి కళ్యాణ మండపంలో టిడిపి, జనసేన పార్టీల ఉమ్మడి ఆత్మీయ సమావేశం సుక్రవారం నిర్వహించారు. మాజీ మంత్రి, టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి పరిపాలన అరాచకంగా తయారైందని అన్నారు. దానిని నిలువరించేందుకు ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని కోరారు. అవినీతి అక్రమాలతో కూరుకుపోయిన వైసిపీని ఓడించటమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని కోరారు. నియోజకవర్గంలో మంత్రి నాగార్జున అవినీతి అక్రమాలపై చిట్టా చేయాలని అన్నారు. టిడిపి, జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలని కోరారు. ప్రజల సమస్యలపై దృష్టి సారించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చెప్పాలని అన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలపై కార్యచరణను ప్రకటించాల్సి ఉందన్నారు. నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రోడ్ల దుస్థితిని వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని అన్నారు. టిడిపి, జనసేన చేపడుతున్న ఉమ్మడి కార్యక్రమాలతోపాటు మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను ప్రజలకు వివరించాలని అన్నారు. బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ నినాదాన్ని కరపత్రాల రూపంలో ఇంటింటికి తిరిగి ఉమ్మడిగా అందజేయాలని కోరారు. జనసేన నియోజకవర్గ కన్వీనర్ ఊస రాజేష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దించడమే లక్ష్యంగా జనసేన, టిడిపి కలిసి పని చేస్తుందని అన్నారు. పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న వైసీపీని సాగనంకెందుకు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు నడుస్తామని అన్నారు. గ్రామస్థాయి వరకు జనసేన, టిడిపి కలిసి పనిచేస్తుందని అన్నారు. ఎలాంటి విభేదాలు లేకుండా సమన్వయంతో కలిసి పని చేయాల్సి ఉందని కోరారు.