Aug 11,2023 21:17

చమర్తి జగన్‌మోహన్‌రాజు

రాజంపేట అర్బన్‌ : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగురవేయడమే తన లక్ష్యమని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు, ప్రముఖ విద్యావేత్త చమర్తి జగన్మోహన్‌రాజు పేర్కొన్నారు. ప్రజాశక్తితో ఆయన మాట్లాడుతూ గతంలో టికెట్‌ ఆశించి దక్కకపోయినప్పటికీ పార్టీలోనే ఉంటూ ప్రజాసేవతో ప్రజలకు మరింత దగ్గరై పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కషి చేస్తున్నానని అన్నారు. తెలుగుదేశం పార్టీ అట్టడుగున ఉన్న ప్రజల సంక్షేమం కోసం నిర్మించబడిందని, ఆది నుంచి సేవా భావం కలిగి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్న తాను ప్రజలకు మరింత సేవ చేసేందుకే తెలుగుదేశం పార్టీలో కొనసాగు తున్నట్లు తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అణగారిన ప్రజలకు ఆశాదీపం, వెన్ను-దన్ను టిడిపియే నని అన్నారు. ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని వైసీపీ ను నమ్మి ప్రజలు నిలువునా మోసపోయారని, రాష్ట్ర ప్రజానీకమంతా తిరిగి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కోరుకుం టోందని తెలిపారు. 2024 లో టిడిపి ప్రభంజనాన్ని వైసిపి అడ్డుకోలేదని అన్నారు. అధిష్టానం ప్రకటించిన మినీ మ్యానిఫెస్టో ప్రజలకు చేరువ యిందని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు పార్టీ భరోసా కల్పించిందని అన్నారు. లోకేష్‌బాబు చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడమే రాష్ట్రంలో నాయకత్వ మార్పును ప్రజలు కోరుకుంటున్నాట్లు స్పష్టమవుతోందని తెలిపారు.
ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బలోపేతం చేస్తా
నియోజకవర్గంలో టీడీపీలోని అనేకమంది నేతల నాయకత్వంలో ద్వితీయ శ్రేణి నాయకులకు తగిన గుర్తింపు రాలేదని.. అసంతప్తులను, ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బలపరిచి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటూ నియోజకవర్గంలో పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో విజయవంతమయ్యానని చెప్పడంలో సందేహం లేదని తెలిపారు. టిడిపికి క్యాడరే బలమని, క్యాడర్‌ ను నడిపించే కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం జరుగుతోందని తెలిపారు. వారిలో ఒకరిగా ఉంటూ క్లిష్ట సమయాలలో చేయూతనిచ్చి ధైర్యాన్ని నింపుతూ ముందుకు తీసుకెళ్లడం జరుగుతోందని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలను కలియ తిరుగుతూ ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం దిశగా కషి చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఊక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలకు ఓదార్పునిస్తూ అవసరమైన చోట స్వచ్ఛందంగా సహాయ సహకారాలు అందిస్తూ కుటుంబంలో ఓ వ్యక్తిలా ప్రజల హదయాలలో చెరగని ముద్ర వేసుకోవడం జరిగిందని అన్నారు. నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ తన వెన్నంటే ఉంటారని తెలిపారు. ప్రజలలో ఆదరణ, కార్యకర్తల నిండైన అభిమానం, అధినేత చంద్రబాబు ఆశీస్సులు తమకు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. అవకాశం ఇస్తే అత్యంత మెజారిటీతో నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగురవేసి సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు.