Oct 16,2023 21:57

ప్రజాశక్తి - కాళ్ల   
             తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంక్షేమం, అభివృద్ధి పార్టీలకు అతీతంగా ప్రతిఒక్కరికీ ఇచ్చామని ప్రజలందరికీ ఇప్పుడు అర్థమైందని, ఎప్పుడు ఎన్నికలోచ్చినా వైసిపిని ఇంటికి పంపడం ఖాయమని ఉండి ఎంఎల్‌ఎ మంతెన రామరాజు అన్నారు. మండలంలోని కాళ్ల గ్రామంలో బాబుతో నేను ఇంటింటికి ప్రచారం కార్యక్రమం టిడిపి మండల అధ్యక్షులు గుండాబత్తుల వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ రామరాజు మాట్లాడుతూ చంద్రబాబుకు జైలులో కనీస సౌకర్యాలు కల్పించడంలేదని, బాబుకు ఏదైనా జరిగితే వైసిపి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి బండారు వేణు గోపాలరావు, పార్టీ మండల అధ్యక్షులు గుండాబత్తుల వెంకట నాగేశ్వరరావు, టిడిపి కాళ్ల గ్రామ అధ్యక్షులు కొప్పినీడి గణపతి, పుప్పాల బుజ్జి, బరకాల శ్రీను, కె.చందు, వీరమల్లు సురేష్‌, చవ్వాకుల నాని, బండారు సోమేశ్వరరావు, బండారు నాని పాల్గొన్నారు.
వీరవాసరం :వైసిపి ప్రభుత్వం చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించిందని టిడిపి నాయకులు అన్నారు. ఈ మేరకు బాబు వెంటే మేము అంటూ సోమవారం చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ టిడిపి నాయకులు వీరవాసరం గాంధీ బొమ్మ సెంటర్‌ నుంచి తూర్పు సెంటర్‌ వరకు కరపత్రాలు పంచారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వీరవల్లి శ్రీనివాసరావు, చింత కనకయ్య, కడలి నెహ్రు, పోశెంశెట్టి శ్యామలరావు, చింతపల్లి మాణిక్యాలరావు, ఆకుల బాలరాజు పాల్గొన్నారు.
పాలకొల్లు : చంద్రబాబు అరెస్టుపై నిరసనగా పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్‌ వద్ద టిడిపి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 34వ రోజు సోమవారం కొనసాగాయి. సోమవారం పట్టణ, మండల మహిళలు దీక్షల్లో కూర్చున్నారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు కర్నేన రోజారమణి మాట్లాడారు.
నరసాపురం టౌన్‌ : చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నరసాపురం మాజీ ఎంఎల్‌ఎ బండారు మాధవనాయుడు తలపెట్టిన పోస్టు కార్డు ఉద్యమంలో భాగంగా పట్టణంలోని 26వ వార్డు వీవర్స్‌ కాలనీలో టిడిపి కుటుంబ సభ్యులు రాష్ట్రపతికి, గవర్నర్‌కు పోస్ట్‌ కార్డులు తపాలా ద్వారా పంపి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పులపర్తి సతీష్‌, పులపర్తి శ్రీధర్‌, సూరిబాబు పాల్గొన్నారు.
భీమవరం రూరల్‌ : చంద్రబాబు అరెస్టుపై నిరసనగా టిడిపి పట్టణ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు అధ్యక్షతన కరపత్రాల పంపిణీ, రచ్చబండ కార్యక్రమం భీమవరం పట్టణం 29వ వార్డు గొల్లవనితిప్పరోడ్‌ ప్రకాష్‌ నగర్‌లో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారధి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇందుకురి సుబ్రహ్మణ్యరాజు, గూడూరి సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్‌, టిడిపి నాయకులు పాల్గొన్నారు.