ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ గత టిడిపి హయాంలోనే కాకినాడ నగరాన్ని అభివద్ధి పథంలో నడిపించగా నేడు వైసిపి పాలకులు కార్పొరేషన్ నిధులను దోచుకోవడంపై దృష్టి సారిస్తున్నారని టిడిపి పట్టణ అధ్యక్షుడు మల్లిపూడి వీరు ఆరోపించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలు భూకబ్జాలపై మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు పూర్తి ఆధారాలతో అధికారులకు ఫిర్యాదు చేస్తే వాటిపై సమాధానం చెప్పకుండా వైసిపి నాయకులు అవాస్తవాలు, అసత్యాలు, మాట్లాడుతూ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. నగరానికి స్మార్ట్ సిటీ తీసుకువచ్చి అభివద్ధి పరిచింది ఎవరో తెలుసుకోవాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేయించి 80 శాతం పనులు పూర్తి చేస్తే ఈ నాలుగేళ్ల వైసిపి పాలనలో మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించలేకపోయారన్నారు. ఈ కార్యక్రమంలో జొన్నాడ వెంకటరమణ, దారా, మూగు రాజు, కోడూరు పెద్ద, అమలకంటి బలరామ్, రాజు, నిద్రబింగి సత్తిబాబు పాల్గొన్నారు.










