ప్రజాశక్తి- పెనుకొండ : టిడిపి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు కృషితోనే గొల్లపల్లి రిజర్వాయర్ ను పూర్తిచేసే చేసి, సాగు,తాగు నీటిని అందించడం జరిగిందని టీడీపీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి బికె. పార్థసారథి పేర్కొన్నారు. ఈనెల 3 తేదీన చంద్రబాబు పర్యటన నేపథ్యంలో మంగళవారం మండలంలోని గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద ఏర్పాట్లను మాజీ మంత్రులు పరిటాల సునీతమ్మ, కాలవ శ్రీనివాసులుతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బికె పార్థసారథి మాట్లాడుతూ రాయలసీమలో కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ప్రముఖ ఇంజనీర్ శివరామకృష్ణ సూచనల మేరకు హంద్రీనీవా పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి కొంత మేర పనులు చేశారని తెలిపారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించి 18నెలల్లోనే గొల్లపల్లి రిజర్వాయర్ ని పూర్తి చేసి కియా కార్ల పరిశ్రమను ఈ ప్రాంతానికి తీసుకురావడానికి కృషి చేశారన్నారు. తద్వారా ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. చంద్రబాబు కృషి తోనే ఈ ప్రాంతంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్నారు. ఇంకా 14 కియా అనుబంధ పరిశ్రమలు రావాల్సి ఉన్నా సిఎం జగన్,ఎమ్మెల్యే శంకర్ నారాయణ టాక్స్ లకు బయపడి ఇతర రాష్ట్రాలకు వెళ్ళాయన్నారు. తిరిగి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అనుబంధ పరిశ్రమల ను తీసుకువస్తామన్నారు. టీడీపీ తోనే రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సిద్దయ్య, రవిశంకర్, లక్ష్మీనారాయణరెడ్డి, పోతిరెడ్డి, గొందిపల్లి సూరి, బాబుల్ రెడ్డి, శ్రీనివాసులు, గుట్టూరు నాగరాజు, శేషు, రమేష్, కమలాకర్, విశ్వనాధ్, సిద్దప్ప, హరి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.










