Aug 09,2023 22:07

స్టాల్స్‌ను పరిశీలిస్తున్న మంత్రులు రాజన్నదొర, అమర్‌నాథ్‌, జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, కాంతిలాల్‌దండే, తదితరులు

ప్రజాశక్తి-సాలూరు : టిడిపి హయాంలో గిరిజనులకు చేసింది శూన్యమని, ఆదివాసీలకు అండగా నిలిచిందని తామేనని డిప్యూటీ సిఎం రాజన్నదొర అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ప్రపంచ ఆదివాసీ ఉత్సవాలను ఆయన జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అమర్‌నాథ్‌, జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ డివిజి శంకరరావు, జిసిసి చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా ఆదివాసీ సంప్రదాయ నృత్యాలతో గిరిజన మహిళలు మంత్రులకు స్వాగతం పలికారు. అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖల స్టాళ్లను తిలకించారు. తర్వాత ఆదివాసీ జెండాని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో రాజన్నదొర మాట్లాడుతూ 1/70 చట్టం, ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టం, పీసా చట్టం, అటవీ హక్కుల చట్టాలు గిరిజన అభివృద్ధికి దోహదపడ్డాయని చెప్పారు. వైసిపి ప్రభుత్వ హయాంలో 1.5 లక్షల మందికి 2.6 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసినట్లు తెలిపారు. 14 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు నాయుడు కేవలం 16 వేల మందికి 40 వేల ఎకరాల భూమి మాత్రమే పంపిణీ చేశారని గుర్తుచేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో షెడ్యూల్‌ గ్రామాల గుర్తింపు కోసం కమిటీ వేసినట్లు తెలిపారు. త్వరలో ఈ కమిటీ సభ్యులు జిల్లాలో పర్యటించి గిరిజన సంఘాల నాయకులను కలుస్తారని చెప్పారు. జిఒ 3 రద్దుకు వ్యతిరేకంగా ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ వేసిందని చెప్పారు. గిరిజన సలహామండలిలో తీర్మానం కూడా చేసినట్లు తెలిపారు.
జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అమర్‌నాథ్‌ మాట్లాడుతూ గిరిజనులు మొదటి నుంచి వైసిపికి అండగా నిలుస్తున్నారని చెప్పారు. నాలుగేళ్లలో లక్షా 50 వేల మందికి ఇళ్లు మంజూరు చేసిన ఘనత వైసిపిదేనని తెలిపారు. జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ వెనుకబడిన మన్యం జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేసిన ఘనత సిఎం జగన్‌దేనని చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు ఇక నుంచి కాస్మోటిక్‌ ఛార్జీలు జిసిసి ద్వారా మంజూరవుతాయని చెప్పారు.
అనంతరం ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ డివిజి శంకరరావు, జిసిసి చైర్‌ పర్సన్‌ స్వాతిరాణి, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ మురళి, పాచిపెంట ఎంపిపి బి.ప్రమీల, ఎస్‌టి సెల్‌ జిల్లా కన్వీనర్‌ కొండగొర్రి ఉదరు కుమార్‌ మాట్లాడారు. సీనియర్‌ గిరిజన నాయకులు, ప్రజాప్రతినిధులు మువ్వల ఆదియ్య, తాడంగి కన్నం నాయుడు, చింత సీతయ్యను సత్కరించారు. కార్యక్రమంలో ఐటిడిఎ పిఒ విష్ణుచరణ్‌, జెసి గోవిందరావు, డిడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న కళారూపాలు
ఆశ్రమ పాఠశాలల విద్యార్థినులు, పాడేరు, అరకు, సీతంపేట ప్రాంతాలకు చెందిన గిరిజనులు చేసిన ఆదివాసీ కళారూపాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మన్యం జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చిన గిరిజనులతో సభా ప్రాంగణం కోలాహలంగా మారింది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత గిరిజన బాలికలతో కలిసి డిప్యూటీ సీఎం రాజన్నదొర చేసిన నృత్యం ఆకట్టుకుంది.