
ప్రజాశక్తి - యంత్రాంగం
టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ సోమవారం చేపట్టిన బంద్ జిల్లాలో ప్రశాంతంగా సాగింది. ఈ సందర్భంగా పలుచోట్ల వ్యాపార దుకాణాలు, విద్యాసంస్థలు, బ్యాంకులు మూతపడ్డాయి. కొందరు స్వచ్ఛందంగా దుకాణాలు, ప్రయివేటు విద్యాసంస్థలను మూసివేసి బంద్‌కు సహకరించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
భీమవరం రూరల్:చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ భీమవరంలో ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన బంద్ పాక్షికంగా జరిగింది. టిడిపి, జనసేన నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో బంద్ నిర్వహణకు స్థానిక ప్రకాశం చౌక్‌కు చేరుకున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలోని దుకాణాలు మూయించారు. ఇదే క్రమంలో కొందరు వ్యాపారులు స్వచ్ఛందంగానే తమ దుకాణాలు మూసివేశారు. ఈ క్రమంలో టిడిపి, జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. టిడిపి నేత మెంటే పార్థసారధి, జనసేన నేత చెలమలశెట్టి చంద్రశేఖర్‌తోపాటు పలువురు నేతలను పోలీస్ వ్యాన్లలో ఎక్కించి వారి నివాసాలకు తరలించి గృహనిర్బంధం చేశారు. మిగిలిన నేతలను టిడిపి కార్యాలయం వద్దకు తరలించి అక్కడ నిర్బంధించారు. టిడిపి కార్యాలయం వద్ద రిలేదీక్షలు కొనసాగాయి. దీక్షల్లో నేతలు వేండ్ర శ్రీనివాస్, గంటా త్రిమూర్తులు, చంద్రశేఖర్, ఐజాక్‌బాబు, గూడూరు సుబ్బారావు, ఏసుపాదం పాల్గొన్నారు. పోలీసు బందోబస్తు నడుమ ఆర్‌టిసి బస్సులు యధావిధిగా నడిచాయి.
ఆచంట : ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. టిడిపి నేతలు కచేరీ సెంటర్‌లో జోరు వర్షంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. మధ్యాహ్నం సమయంలో వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు. జనసేన నాయకులు జవ్వాది బాలాజీ, నంబూరు విజరు, పితాని లక్ష్మణ్, నిమ్మన వీరశేఖర్‌బాబు, సిపిఎం నాయకులు వర్ధిపర్తి అంజిబాబు, ఎస్‌విఎన్.శర్మ, తలుపూరి బుల్లబ్బాయి, సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి దిగమర్తి సూర్యకుమారి, జెడ్‌పిటిసి సభ్యులు ఉప్పలపాటి సురేష్‌బాబు, పార్టీ మండల అధ్యక్షులు కేతా మీరయ్య, నాయకులు గొడవర్తి శ్రీరాములు, చిలుకూరి సత్యవతి, బీర నరసింహమూర్తి, ఆకుమర్తి మోహన్, వర్ధనపుహరి, సిర్రా బాలాజీ, నెక్కంటి ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.
కాళ్ల : మండల కేంద్రమైన కాళ్లలో టిడిపి, జనసేన ఆధ్వర్యంలో నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. జువ్వలపాలెం, ఏలూరుపాడు, కాళ్లకూరు, కాళ్ల, జక్కరం, కోపల్లె తదితర గ్రామాల్లో వ్యాపార సముదాయాలు, పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. పోలీసులు పలు కూడళ్లలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాళ్లలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు. మండలంలో బంద్ ప్రశాంతంగా సాగింది.
పెనుమంట్ర : చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టిడిపి చేపట్టిన బంద్ మండలంలో పాక్షికంగా సాగింది. ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలతో పాటు బ్యాంకులు, వ్యాపార సంస్థలను మూసివేశారు. పెనుమంట్ర, మాముడూరు, భట్లమాగుటూరుతో పాటు పలు గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో టిడిపి మండల అధ్యక్షులు తమనంపూడి శ్రీనివాస ్‌రెడ్డి, కార్యదర్శి మురళీమోహన్‌రావు, కర్రి అచ్యుత రామరెడ్డి పాల్గొన్నారు. మండలంలో అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఎస్‌ఐ షేక్ మదీనాబాషా శాంతిభద్రతలను పర్యవేక్షించారు.
గణపవరం : జనసేన, టిడిపి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య, వ్యాపార, ప్రభుత్వ సంస్థలు మూతపడ్డాయి. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు కె.సురేంద్రరాజు, జనసేన నాయకులు వంగా రఘు, తోట శ్రీను, మైనార్టీ సెల్ నాయకులు బషీరుద్దీన్, వెంకటేశ్వరరావు, మధు, చిన్న, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
మొగల్తూరు : మండలంలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. మొగల్తూరులోని దుకాణాలను ఆ పార్టీ నాయకులు మూయించి వేశారు. స్థానిక గాంధీబొమ్మ సెంటర్‌లో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు పాల రాంబాబు, గోపాలం, బి.చంటి, కొల్లాటి భోగరాజు, బస్వాని ఏడుకొండలు, గుబ్బల చిన్న నాగరాజు, కృష్ణ, పాము శ్రీధర్, వెలిది పుల్లారావు పాల్గొన్నారు.
పెనుగొండ : టిడిపి, జనసేన ఆధ్వర్యంలో పెనుగొండలో బంద్ సందర్భంగా ధర్నా నిర్వహించారు. కాలేజీ సెంటర్ నుండి బజార్ రోడ్డు మీదగా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వ్యాపార సముదాయాలు, బ్యాంకులు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కార్యదర్శి కటికిరెడ్డి నానాజీ, నక్క వేదవ్యాసశాస్త్రి, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉండి : టిడిపి బంద్‌కు జనసేన మద్దతు తెలిపిన నేపథ్యంలో జనసేన ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి జుత్తిగ నాగరాజును ఎఎస్‌ఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు గృహనిర్బంధం చేశారు. తెల్లవారుజామున మహదేవపట్నంలోని జుత్తిగ నాగరాజు నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయనను ఇంటిలోనే నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన నడుస్తుందని, ప్రశ్నించిన వారిని అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్‌ని సైతం అడ్డుకున్నారని, ఆయన రోడ్డు మార్గంలో ప్రశాంతంగా వస్తుంటే ఆయన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో రాష్ట్ర ప్రజానీకం చూస్తోందని, అధికార పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదే జగన్ లక్ష్యంగా కనిపిస్తుందని, ఇది ప్రజాస్వామ్యంలో ఎంతమాత్రమూ సాధ్యంకాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీరవాసరం : మండలంలో బంద్ పాక్షికంగా జరిగింది. బలవంతంగా దుకాణాలు మూయిస్తున్నారంటూ టిడిపికి చెందిన నలుగురిని ఎస్‌ఐ రమేష్ అదుపులోకి తీసుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిస్థితిని పోలీసులు పర్యవేక్షించారు.
తాడేపల్లిగూడెం : నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి వలవల మల్లికార్జునరావు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని తలుకా ఆఫీస్, ఆర్‌టిసి బస్టాడ్ వద్ద టిడిపి నాయకులు ధర్నా నిర్వహించారు. బంద్‌కు వ్యాపార సముదాయాలు, బ్యాంకులు, పలు ప్రయివేటు విద్యాసంస్థలు మూతపడ్డాయి.ఉదయం టిడిపి నాయకులు ఆర్‌టిసి డిపో ముందు ధర్నా నిర్వహించి కొద్దిసేపు బస్సులను నిలిపివేశారు. అనంతరం పోలీసులు నాయకులను అక్కడ నుంచి పంపించివేశారు. దీంతో బస్సులు యథావిధిగా నడిచాయి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఉండి : మండలంలో బంద్ పాక్షికంగా జరిగింది. ఈ సందర్భంగా టిడిపి మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజును గృహనిర్బంధం చేశారు. పార్టీ రాష్ట్రకార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ బంద్‌కు జనసేన నాయకులు మద్దతు తెలిపారు. వాణిజ్య, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఆటోలు, ఆర్‌టిసి బస్సులు యథావిధిగా తిరిగాయి. ఈ కార్యక్రమంలో జనసేన ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి జుత్తిగ నాగరాజు, టిడిపి నేతలు ముదునూరి కృష్ణంరాజు, కునుకు శ్రీనివాస్, గురుగుబిల్లి వెంకటసత్యనారాయణ, మంతెన సాయిలచ్చిరాజు, కందుల బలరాం పాల్గొన్నారు.
ఆకివీడు : అవినీతి, అక్రమ అరెస్టులు, అన్యాయ పాలన ఆగేవరకూ టిడిపి పోరాటం సాగుతుందని ఆ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు గొంట్ల గణపతి అన్నారు. ఆకివీడులో బంద్ ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా టిడిపి, జనసేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్య, వ్యాపార సంస్థలు పూర్తిస్థాయిలో మూతపడ్డాయి. అల్లర్లు, గొడవలు జరగకుండా పోలీసులు ఎక్కడికక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మండల కార్యదర్శి నవకోట్ల రామారావు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు బి.వెంకట్రావు, గంధం ఉమా సత్యనారాయణ, మైనార్టీ విభాగం జిల్లా నాయకులు అజ్మల్, జనసేన నాయకులు అనిల్, విజరు పాల్గొన్నారు.
నరసాపురం టౌన్ : పట్టణంలో బంద్ ప్రశాంతంగా సాగింది. ఈ బంద్‌కు జనసేన మద్దతు తెలిపింది. వ్యాపార దుకాణాలు, పలు ప్రయివేటు విద్యాసంస్థలను స్వచ్ఛందంగా మూసివేసి బందుకు సహకరించారు. ఆర్‌టిసి బస్సులు మాత్రం యథావిధిగా తిరిగాయి.
టిడిపి, జనసేన నేతల అరెస్ట్
పట్టణంలో ఆందోళన చేస్తున్న పలువురు టిడిపి, జనసేన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున నలుగురుకు మించి ఉండకూడదని, ధర్నాలు చేయరాదని పోలీసులు హెచ్చరించారు. అయినప్పటికీ నేతలు ఆందోళన చేయడంతో అరెస్టుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, టిడిపి నేతలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. టిడిపి నేత పొత్తూరి రామరాజు ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయిం చారు. పోలీసుల హెచ్చరికలను భేఖాతారు చేసిన నేతలను అరెస్ట్ చేసి వాహనాల్లో ఎక్కించి స్టేషన్ కు తరలించారు. ఈ బందుకు మద్దతు తెలిపిన జనసేన నాయకులు మిషన్ హై స్కూల్ రోడ్డు లోని పార్టీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. పార్టీ ఇన్‌ఛార్జి బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో జనసైనికులు, వీరామహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడకు చేరుకుని నాయకర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తణుకు : పట్టణంలో బంద్ విజయవంతమైంది. ఉదయం నుంచి టిడిపి శ్రేణులు రోడ్లపైకి వచ్చి షాపులను మూసివేయించారు. ఆర్‌టిసి బస్సులను అడ్డుకున్నారు. ప్రయివేటు విద్యాసంస్థలకు ముందుగానే సెలవు ప్రకటించారు. వ్యాపార సంస్థలు, బ్యాంకులు, పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లో ముసివేశారు. మాజీ ఎంఎల్‌ఎ ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో టిడిపి నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా చర్యలు తీసుకున్నారు. ఆదివారం రాత్రి నుంచి రాధాకృష్ణ నివాసం వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, బసవ రామకృష్ణ పాల్గొన్నారు.