ప్రజాశక్తి కదిరి అర్బన్ : వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధులు చెప్పిన విధంగానే బిఎల్వోలు కొంతమంది సంబంధిత అధికారులు ఒటరు జాబితాను సిద్ధం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు టిడిపి పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్, రాజశేఖర్ బాబు, చెన్నకేశవులు ఆధ్వర్యంలో నాయకులు సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. కదిరి నియోజవర్గ వ్యాప్తంగా మరణించిన వారి పేర్లను, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారి పేర్లను, రెండు చోట్ల ఉన్న వారి పేర్లను సమర్పించిన కూడా అధికారులు వాటిని తొలగించకుండా వైసిపి నాయకులు చెప్పినట్లు చేస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇచ్చిన ఒటరు జాబితా నివేదికపై అధికారులు చర్యలు తీసుకోకపోతే ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.