ప్రజాశక్తి-యంత్రాంగం
టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ సిఎం నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై నిరసన తెలియ జేస్తూ జిల్లా ఆ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఆదివారం బాబుతో నేను కార్యక్రమం నిర్వహించారు.
కపిలేశ్వరపురం వెదురుమూడిలో ఆదివారం నిర్వహించిన బాబుతో నేను కార్యక్రమంలో ఎంఎల్‌ఎ వేగుళ్ళ జోగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. టిడిపి శ్రేణులతో ఆయన కలిసి ఇంటింటా పర్యటించి చంద్రబాబు నాయుడు పై పెట్టిన అక్రమ కేసుల వివరాలను ప్రజలకు వివరించారు. చంద్రబాబుకు ఏమైనా హాని జరిగితే వైసిపి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎంఎల్‌ఎ వేగుళ్ళ హెచ్చరించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు, తదితరులు, పాల్గొన్నారు. ఆలమూరు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై నిరసన తెలియజేస్తూ మండలంలోని నర్సిపూడి లో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంఎల్‌ఎ బండారు సత్యానందరావు ఆ శ్రేణులతో కలసి ఆదివారం సాయంత్రం ''బాబుతో నేను'' కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామస్తులకు టిడిపి విధివిధానాలను వివరించారు. మండల పరిధి టిడిపి నేతలు పాల్గొన్నారు.










