
ప్రజాశక్తి-విజయనగరం కోట : జగనాసురా దహనకాండతో రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందని టిడిపి నాయకులు అన్నారు. స్థానిక అశోక్ బంగ్లా టిడిపి కార్యాలయంలో జగనాసురా దహనకాండ కార్యక్రమాన్ని టిడిపి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి అసూయ, కుట్ర, కుతంత్రాలతోనే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించారని అన్నారు. నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ప్రజల్లో ఎంతో స్పందన వస్తుందని, ఆయన ఎదుగుదలను చూసి వార్వలేని జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కుట్ర పన్నారని అన్నారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, కార్యదర్శి బంగారు బాబు, విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు కార్యాలయ కార్యదర్శి రాజేష్ బాబు కర్రోతు నర్సింగరావు, రొంగలి రామారావు, శ్రీనివాసరావు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో రివర్సుగేర్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న టిడిపి నాయకులు
రాష్ట్రం రివర్స్ గేర్ లో నడుస్తోంది..
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మూర్ఖంగా ఆలోచించి రాష్ట్రాన్ని రివర్స్ గేర్‌లో నడిపిస్తున్నారని టిడిపి నాయకులు గణపతినీడి శ్రీనివాసరావు ఆరోపించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రివర్స్ గేర్‌లో ఎపి అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. మయూరి జంక్షన్ నుంచి బాలాజీ జంక్షన్ మీదుగా కోట జంక్షన్ వరకు రివర్స్‌లో పాదయాత్ర అనే కార్యక్రమాన్ని టిడిపి నాయకులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగున్నర ఏళ్లలో రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో తెలియజేయడానికి రివర్స్ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నమన్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన విషయాన్ని గమనించి ప్రజలు మేలుకోవాలన్నారు.
కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు మాట్లాడుతూ గత నాలుగున్నర ఏళ్లలో పోలవరం, పరిశ్రమల అభివృద్ధి రివర్స్ లోనే ఉన్నాయన్నారు. సైకో సిఎంకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో కనకల మురళీమోహన్, బొద్దల నరసింగరావు, కర్రోతు నర్సింగరావు టిడిపి న్యాయవిభాగం నాయకులు ఉపాధ్యాయుల రవిశంకర్, తెలుగు యువత నాయకులు సురేంద్ర, చైతన్య, ప్రవీణ్, టిడిపి నాయకులు కుటుంబరావు, కిలాని మహేష్, తదితరులు పాల్గొన్నారు.
వైసిపి మూల్యం చెల్లించుకోక తప్పదు
విజయనగరం టౌన్ : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును వైసిపి ప్రభుత్వం పైశాచిక ఆనందం కోసమే అరెస్ట్ చేసిందని జనసేన నాయకులు గురాన అయ్యలు అన్నారు. టిడిపి పిలుపు మేరకు జగనాసుర దహనం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో సైకో పాలన పోవాలంటూ రాసిన పత్రాలను జనసేన పార్టీ ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ సందర్భంగా అయ్యలు మాట్లాడుతూ వైసిపిని ఓడించడం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. జగన్ లాంటి నియంతకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు కాటం అశ్విని, అడబాల వేంకటేష్ , ఎమ్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.