టిడిపి అధినేత అరెస్టు అప్రజాస్వామికం
సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్
ప్రజాశక్తి - నంద్యాల
నంద్యాలలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బస చేసిన ప్రాంతానికి వందలాది మంది పోలీసులు తెల్లవారుజామున వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తూ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని, తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్ అన్నారు. శనివారం నంద్యాలలోని సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీమొన్స్ కంపెనీ వారి ఆధ్వర్యంలో నడిచే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద జమ కావాల్సిన నిధుల అవకతవకలపై విచారణ జరిపించిన తర్వాత చర్యలు తీసుకోవాలన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా చూపించకుండా భయభ్రాంతులను గురి చేస్తూ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజలు, ప్రజాతంత్ర వాదులు దీన్ని ఖండించాలని కోరుతున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా గృహ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు చేస్తూ స్టేషన్లో ఉంచడం దారుణమన్నారు. వెంటనే వారిని విడుదల చేయాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును విడుదల చేసి వచ్చిన ఆరోపణలపైన విచారణ జరిపించాలని జిల్లా కమిటీగా కోరుతున్నామన్నారు. సమావేశంలో సిపిఎం పట్టణ కార్యదర్శి పుల్లా నరసింహులు, కార్యదర్శి వర్గ సభ్యులు డి.లక్ష్మణ్, వెంకట లింగం, నాయకులు శివ, ఓ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని అప్రజా స్వామికంగా అరెస్ట్ చేయడాన్ని సిపిఎం ఖండిస్తోందనిజిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి. యేసు రత్నం, పట్టణ కార్యదర్శి ఏ. రణధీర్ అన్నారు. విలేకరులతో వారు మాట్లాడుతూ ఎటువంటి ఆధారాలు లేకుండా కనీసం ఎఫ్‌ఐఆర్ చూపించకుండా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. సిపిఎం పట్టణ నాయకులు డి. రామ్ నాయక్, ఏ. సురేంద్ర, ఎన్. స్వాములు,సద్దాం హుసేన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు : మాజీ సిఎం చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని సిపిఎం నాయకులు ఖండించారు. స్థానిక సుండిపెంట సిపిఎం కార్యాలయంలో శాఖ కార్యదర్శి యం మల్లికార్జున అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు మునిపాటి చిన్న మారెన్న, పార్టీ మండల నాయకులు నాగసైదయ్య, సిఐటియు మండల అద్యక్షుడు దర్శనం నాగరాజు మాట్లాడారు. నాయకులు నాగవెంకటేశ, మల్లి, పౌలయ్య, గాలయ్య, ప్రభా కర్, నాగేశ్వర రావు, రంగస్వామి, గంగులు, తదితరులు పాల్గొన్నారు.










