కొమరాడ: 2024 ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నియోజకవర్గంలోనే దీర్ఘకాల సమస్యగా ఉన్న పూర్ణపాడు-లాబేసు వంతెన పూర్తి చేస్తామని కురుపాం నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి తోయిక జగదీశ్వరి అన్నారు. మండలంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా బస్సు యాత్ర పూర్ణపాడు లాభేషు వద్దకు మంగళవారం చేరుకుంది. ఈ సందర్భంగా ముందుగా టిడిపి నాయకులు వంతెన నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం వంతెన ప్రాంగణంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. టిడిపి మండల కన్వీనర్ శనపతి ఉదయశేఖర్ పాత్రుడు అధ్యక్షతన జరిగిన సభలో జగదీశ్వరి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతంలో పాదయాత్రకు వచ్చి వంతెన పూర్తి చేస్తానని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని అన్నారు. గత టిడిపి ప్రభుత్వంలో వంతెన మంజూరు చేసి 70శాతం పనులు చేశామని, వైసీపీ వచ్చి నాలుగున్నరేళ్లు కావస్తున్నా ఒక్క శాతం కూడా వంతెన పనులు చేయకపోవడం చూస్తే గిరిజనుల పక్షాన వైసిపి ప్రభుత్వం ఏ మేరకు పాలన చేస్తుందో అర్థమవుతుంది అన్నారు. మొన్న కురుపాం వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి వెళ్ళిపోయారు తప్ప నియోజకవర్గంలో గిరిజనులు ఎదుర్కొంటున్న కనీస సమస్యలపై ప్రస్తావించక పోవడం చాలా దురదష్టకరమని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి కూడా సమస్యలను ముఖ్యమంత్రి దష్టిలో పెట్టకపోవడం చూస్తే నియోజకవర్గ ప్రజలపై ఎంత శ్రద్ధ ఉందో అర్థం అవుతుందని అన్నారు. నియోజవర్గంలోనే ఒకవైపు ఏనుగులు, మరోవైపు పూర్ణపాడు-లాబేసు వంతెన, గుమ్మడి గెడ్డ, జంఝావతి, వనకాబడి అలాగే పలు రహదారులు అధ్వానంగా ఉన్నా కనీసం ఒక్క పని కూడా చేసిన పరిస్థితి కనిపించలేదు. కావున గిరిజనులు పూర్తిస్థాయిలో ఆలోచించి వచ్చే ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కురుప నియోజవర్గ పరిశీలకులు మహేష్, జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ దత్తి లక్ష్మణరావు, అరుకు పార్లమెంట్ రైతు అధ్యక్షులు దేవకోటి వెంకట నాయుడు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జి సుదర్శన్ రావు, మండలాల టిడిపి కన్వీనర్లు, నాయకులు డొంకాడ రామకష్ణ, పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
గరుగుబిల్లి: టిడిపి చేపట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ బస్సు యాత్ర మండలంలోని ఉల్లిభద్ర తోటపల్లి ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా కుడి ప్రధాన కాలువ వద్ద ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు విగ్రహానికి కురుపాం నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ తోయక జగదీశ్వరితో పాటు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే పూర్తిస్థాయిలో సాగునీరు అందించని జంఝావతి కాలువ, తోటపల్లి పాత రెగ్యులేటర్ పరిధిలోని ఎడమ కాలువ వద్ద మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, జగదీశ్వరి, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, నియోజకవర్గం పరిశీలకులు ఆరేటి మహేష్, టిడిపి నాయకులు నాయకులు సెల్ఫీ దిగారు. అనంతరం తోటపల్లి వరకు బస్సు యాత్రతో పాటు మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం తోటపల్లి వద్ద జరిగిన బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.










