ప్రజాశక్తి- డెంకాడ : ఆంధ్రప్రదేశ్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ 7వ టి-20 క్రికెట్ ఛాంపియన్‌షిప్‌కు భోగాపురం మండలం సుందర పేట గ్రామానికి చెందిన కట్టిరిశెట్టి లికిత్ ఎంపికయ్యాడు. దీంతో లికిత్‌ను నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు తన స్వగృహంలో ఆదివారం అభినందించి క్రికెట్ కిట్, కొంత నగదను బహుకరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుందర హరీష్, పడాల శ్రీను, గోపి, సుందర వెంకన్న, ఎంపిటిసి బంగారాజు పాల్గొన్నారు.
బీమా మంజూరు పత్రం అందజేత
భోగాపురం మండలంలోని కొయ్యపేట గ్రామానికి చెందిన బాకి సూరమ్మ భర్త ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి వైఎస్‌ఆర్ బీమా పథకం కింద రూ. 5లక్షలు మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆదివారం సూరమ్మకు మోపాడలోని ఎమ్మెల్యే స్వగృహంలో అందించారు.
విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే
పూసపాటిరేగ : విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆదవారం పూసపాటిరేగ మండలంలో విశ్వబ్రాహ్మ ణులు ఏర్పాటుచేసిన విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పాల్గొన్నారు. విశ్వకర్మ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల విశ్వ బ్రాహ్మణుల కోరిక మేరకు మండలంలో గుడి నిర్మాణం కోసం స్థలాన్ని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల జెసిఎస్ కన్వీనర్ మహంతి శ్రీనివాసరావు, ప్రాథమిక సహకార బ్యాంకు అధ్యక్షులు మహాంతి లక్ష్మణ్, స్థానిక సర్పంచ్ టి.సీతారాం, విశ్వబ్రాహ్మణులు, పాల్గొన్నారు.










