Oct 15,2023 00:06

ప్రజశక్తి - చీరాల
డాక్టర్ బిఆర్‌ అంబేద్కర్ స్పూర్తితో మానవ హక్కులకు రక్షణ కల్పించాలని కేర్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు జాన్ కోరారు. స్థానిక ఎన్జీఒ భవన్‌లో ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి ఏసురత్నం ఆధ్వర్యంలో అంబేద్కర్ బౌద్ధం స్వీకరణ, దాని ఆవశ్యకత అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సమాజంలో వివక్షా రుగ్మతలకు బౌద్ధం ఒక్కటే పరిష్కారం అన్న ఉద్దేశంలో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ బౌద్ధం స్వీకరించారని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేతులమీదుగా ఉత్తమ ప్రశంసాపత్రం పొందిన తహశీల్దారు జె ప్రభాకరరావును ఘనంగా సన్మానించారు. అనంతరం తహశీల్దారు ప్రభాకరరావు మాట్లాడుతూ అంబేద్కర్ ఒక సామాజిక ఇంజనీర్ అని అన్నారు. ఆయన తనతో పాటు ఆరు లక్షల మందిని బౌద్ధంలోకి మార్చారని అన్నారు. అంబేద్కర్ అనుచరులే ఇప్పుడు 'నియో బుద్దిస్టులు'గా గుర్తింపు పొందారని తెలిపారు. మహాయానం, హీనయానం శాఖల్లాగ వీరిది 'నవయానం' శాఖ అయ్యిందని తెలిపారు. బౌద్ధమే ఒక్కటే మానవీయ సమాజంగా తీర్చిదిద్దగలదనే అంబేద్కర్‌ బౌద్ధం స్వీకరించారని తెలిపారు. ఈ దేశ వాసులకు ఒక మంచి సందేశం, మంచి మార్గాన్ని చూపించానని ఎంతో ఆత్మ విశ్వాసంతో హుందాగా ప్రకటించారని అన్నారు. కార్యక్రమంలో దళిత మహాసభ నాయకులు నూకతోటి బాబురావు, గుమ్మడి రత్న ప్రకాష్, పీటర్ రమేష్, చిరంజీవి పాల్గొన్నారు.