Oct 31,2023 22:18

ధర్నాలో పాల్గొన్న నాయకులు, దళిత రైతులు

ప్రజాశక్తి - లేపాక్షి : మండలం పరిధిలోని కొండూరు, కోర్లకుంట గ్రామ దళిత రైతుల భూములను అక్రమంగా ఆక్రమించిన కుశలవ సంస్థకు స్థానిక తహశీల్దార్‌ కొమ్ముకాస్తున్నారని బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా రైతులు, నాయకులు మాట్లాడుతూ దళిత రైతుల భూములను ఆక్రమించిన కుశలవ సంస్థకు స్థానిక తహశీల్దార్‌ కొమ్ము కాస్తూ, ఆ భూముల వివరాలను రెవిన్యూ రికార్డులను తొలగిస్తానని రైతులకు ఫోన్‌ చేసి మరీ బెదిరిస్తున్నారని విమర్శించారు. రెవిన్యూ రికార్డులను తొలగించకుండా యధాతథంగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే రైతుల ప్రాణాలు తీసి వారి భూములను తీసుకోవాలని భాదితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్య క్రమంలో కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి రమణ, భూ పోరాట కమిటీ మండలాధ్యక్షులు గోపాల్‌, కార్యదర్శి రాము, మల్లి, గంగాధరప్ప, గంగాధర్‌, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.