Dec 11,2022 23:46
తహశీల్దార్‌ శ్రీనివాసరావ్ణు

ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి జిల్లా పెదబయలు మండల తహశీల్దార్‌ శ్రీనివాసరావు మృతి చెందిన ఘటన విశాఖ ఉమ్మడి జిల్లా రెవెన్యూ వర్గాల్లో సంచలనం రేపింది. ఆయన మృతి చెందిన తీరు ముందు పలు అనుమానాలకు తావిచ్చింది. అనూహ్య రీతిలో ఆయన ఉరితాడుకు వేలాడుతూ మృతి చెందిన ఘటన పలువురిని నిశ్చేస్టులను చేసింది. వెనువెంటనే తహశీల్దార్‌ మృతికి దారి తీసిన పరిస్థితులపై మీడియా వర్గాలు, ప్రజా సంఘాల నేతలు, రాజకీయ ప్రతినిధులు ఆరా తీశారు. ఈ క్రమంలో ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి గోపాలకృష్ణ మందలింపులే తహశీల్దార్‌ మృతికి దారి తీసినట్లుగా పలువురి నుంచి ఆరోపణలు వినిస్తున్నాయి. పలువురు రెవెన్యూ ఉద్యోగులు కూడా దీన్ని సత్యమనే చెపుతున్నారు. ఈ నెల 5న ఐటీడీఏలో జరిగిన సమావేశంలో అందరి ముందు పిఓ మందలింపులతోనే తనకు అవమానం జరిగిందని, తాను చనిపోతానంటూ తహశీల్దార్‌ శ్రీనివాసరావు పలువురి వద్ద ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పినట్లు సమాచారం. శ్రీనివాసరావుకు కుటుంబ పరమైన, అనారోగ్య సమస్యలు ఏమీ లేవని భార్య, కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. తహశీల్దార్‌ శ్రీనివాసరావు భార్య శివ సరోజ మీడియాతో మాట్లాడినప్పుడు మానసిక ఒత్తిడి వలనే ఇలా చేసుకుని ఉండవచ్చునని అన్నారు. తహసీల్దార్‌ అనూహ్య మృతిపై శాఖపరంగా అధికారులు ఎటువంటి విచారణ చేపట్టలేదు. కానీ, ఈ సంఘటన జరిగిన మరుసటి రోజే పెదబయలు మండల రెవెన్యూ కార్యాలయంలోని ఉప తహశీిల్దార్‌, సీనియర్‌ అసిస్టెంట్లను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేయడం ఈ ప్రాంతంలో చర్చ నీయాంశం అయింది.ఐటీడీఏ పీవో మందలింపులే తహశీల్దార్‌ బలవరణ మరణానికి ప్రబల కారణంగా ప్రజా సంఘాలు, ఉద్యోగ వర్గాలు నిక్కచ్చిగా విశ్వసిస్తున్నాయి. నిస్సందేహంగా పిఓ హెచ్చరికల మూలంగానే మానసిక ఒత్తిడికి గురైన శ్రీనివాసరావు ఈ దారుణానికి పాల్పడ్డారని చెబుతున్నారు.
పాడేరు ఐటిడిఏ ప్రాజెక్ట్‌ అధికారి పలువురు డివిజనల్‌ అధికారులు, ఉద్యోగులపై కూడా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న తీరుపై పలు విమర్శలు ఉన్నాయి. ఇటీవల ఐటిడిఏ కార్యాలయంలోని ప్రధాన విభాగంలో కొందరు విజిటర్స్‌ (ఉద్యోగులు) లోపలకు వెళ్లి అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడుతున్న సందర్భంగా పిఓ గమనించి సందర్శకులను లోపలకు ఎందుకు రప్పిస్తున్నారని ప్రశ్నించి ఆ విభాగంలో ఉన్న ఉద్యోగులందర్నీ బయటకు రప్పించి మిమ్మల్ని అందరిని సస్పెండ్‌ చేస్తానంటూ హెచ్చరికలు చేసినట్లు తెలిసింది. అధికారులు అని చూడకుండా తీవ్ర పదజాలంతో ఐటీడీఏ పీవో హెచ్చరికలు చేస్తుంటారని పలువురు చెబుతున్నారు. ఎదుటివారికి మనస్థాపం కలిగించే రీతిలో పిఓ వ్యవహార శైలి ఉంటుందని పలువురు ఆరోపిస్తున్నారు.ఆశ్రమ పాఠశాలలకు తనిఖీకి వెళ్ళినప్పుడు ఉపాధ్యాయుల పట్ల కూడా పిఓ తీరు ఇలాగే ఉంటుందని పలువురు అంటున్నారు. ఆశ్రమ పాఠశాలల్లోకి ఎవరిని అనుమతించకూడదని ఉపాధ్యాయులపై పీవో ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పిఓ ఐటీడీఏ స్థాయిలో తలపెట్టిన గిరివిజ్ఞాన సంబరాలను కూడా జిల్లా కలెక్టర్‌ చొరవ తీసుకొని వాయిదా వేసినట్లు తెలిసింది. ప్రాజెక్ట్‌ అధికారి పై పలు ఆరోపణలతో పాటు పాలనా తీరుపై పలు విషయాలను ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకు వెళుతున్న నేపథ్యంలో కలెక్టర్‌ తగు చర్యలకు ఆదేశాలిస్తున్న క్రమంలో పీవో దూకుడుకు కొంత కళ్లెం వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.