Feb 21,2021 12:44

చెన్నపట్నంలో ధనయ్య అనే పిసినారి ఉండేవాడు. వ్యాపారంలో మోసాలు చేసి బాగా సంపాదించాడు. అయినా తింటే ఖర్చవుతుందనే రకం. ఒకసారి పనిమీద ఉదయమే బయటకు వెళ్లాడు. ఇంటికి త్వరగా వద్దామనుకున్నాడు. చల్లగా ఉందిగా, చెప్పులేసుకెళ్ళటం దండగ అనుకున్నాడు. చెప్పులు అరిగిపోతాయని అనుకున్నాడు. చెప్పుల్లేకుండానే బయలుదేరాడు.


పని పూర్తయ్యేసరికి మధ్యాహ్న మైంది. ఇంటిదారి పట్టాడు. వేసవి కాలం కావటం వల్ల కాళ్ళు మండిపోతున్నాయి. పదడుగులు కూడా వేయలేకపోయాడు. ఇంటికెలా చేరటం అనుకున్నాడు. ఓ గోడ నీడకు చేరి ఆలోచనలోపడ్డాడు. ఇల్లు చేరాలంటే రిక్షా ఎక్కడం లేదా చెప్పులు కొనడం రెండే మార్గాలు. రెండూ డబ్బు దండగ పనులే. మరి పైసా కూడా ఖర్చు కాకుండా ఇల్లు చేరడమెలా? అని ఆలోచించగా ఒక ఆలోచన తట్టింది. వెంటనే దగ్గరగా ఉన్న చెప్పుల దుకాణంలోకి వేగంగా నడిచాడు.


'మా తమ్ముడికి చెప్పులు కావాలి చూపించండి' అన్నాడు. తన పాదాల కొలత సరిపోతుందన్నాడు. రకరకాల చెప్పులు చూశాడు. పిసినారి ధనయ్య అలాంటి విలువైన చెప్పులు ఎన్నడూ తొడగలేదు. పైసా ఖర్చు కాకుండా ఆ చెప్పులు ఒక్క రోజయినా తొడగాలనుకున్నాడు. మంచి విలువైన చెప్పులు ఎన్నుకున్నాడు. డబ్బు చెల్లించి, చెప్పులపెట్టె తీసుకొని బయటకు నడిచాడు. బయటకు రాగానే పెట్టె నుండి చెప్పులు తీసి తొడుక్కుని దర్జాగా ఇల్లు చేరాడు. కొత్త చెప్పులను బాగా వాడాడు. రెండు రోజుల తర్వాత చెప్పులను తీసుకొని కొట్టుకి వెళ్ళాలనుకున్నాడు. వచ్చేసరికి ఏవేళవుతుందోనని పాతచెప్పులు వేసుకున్నాడు. ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. అంగడి దగ్గరకు వెళ్ళాలంటే చాలా దూరం నడవాలి. తన చెప్పులు అరిగిపోతాయి కదా! అనుకున్నాడు. అంగడిదాకా కొత్తచెప్పులు వేసుకెళ్ళి అక్కడికెళ్ళాక తుడిచి, పెట్టెలో పెట్టి లోనికెళ్ళి చెప్పులు తిరిగిస్తే సరిపోతుందనుకున్నాడు.


కొత్త చెప్పులేసుకున్నాడు. తన పాత చెప్పులు పెట్టెలో పెట్టుకుని బయలుదేరాడు. అలా నడుస్తూ తన లావాదేవీలకు సంబంధించిన ఆలోచనల్లోపడి అసలు సంగతి మరిచాడు. కొత్త చెప్పులు బయట వదిలి, చెప్పుల అంగడిలోనికెళ్ళాడు.
'అయ్యా! మా తమ్ముడు నేను వెళ్ళే వేళకు కొత్త చెప్పులు కొత్తవి తెచ్చుకున్నాడు. నాకు చెప్పులు ఎలాగూ ఉన్నాయి. మీ చెప్పులు తీసుకుని డబ్బు ఇవ్వండి!' అని చెప్పులపెట్టె, బిల్లు కాగితం ముందరుంచాడు.
'అలా వెనక్కి తీసుకోవడం ఎలా కుదురుతుంది?' అన్నాడు యజమాని.


''ఎందుక్కుదరదూ? నీ చెప్పులేమన్నా బంగారమా? కొరుక్కు తిన్నానా? ఇచ్చినవి ఇచ్చినట్లు తెచ్చాను. అవసరంలేనివి మెడకేసుకుని తిరగమంటావా? అవసరమైతే వచ్చి మీ దగ్గరే కొంటాలే!' అంటూ వాదనకు దిగాడు. విధిలేక చెప్పుల వ్యాపారి పెట్టె తీసుకుని, విప్పి చూశాడు. లోపల అరిగిపోయి, చితికిపోయిన పాత చెప్పులున్నాయి. ధనయ్య తన పొరపాటుకు అవాక్కయ్యాడు. వెంటనే లేచి బయటకు పరుగెత్తాడు. బయట తాను వదిలిన కొత్త చెప్పుల్లేవు. ఎవరో తొడుక్కెళ్ళారు. అక్కడ ఓక్షణం కూడా ఉండలేక వేగంగా ఇంటిదారి పట్టాడు. ఇంటికొచ్చాక పాతచెప్పులు షాపులో వదిలేసి వచ్చానని గుర్తించాడు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా రెండురోజులు కొత్తచెప్పులతో తిరగడంవల్ల కాళ్ళకు గాయాలయ్యాయి. పిసినారితనంతో మందులు వాడక గాయాలు పెద్దవయ్యాయి. కొత్త చెప్పులు, పాత చెప్పులు పోవడమేగాక గాయాలు నయం కావడానికి ఐదువందలు ఖర్చయ్యింది.


విషయం తెలుసుకున్న ధనయ్య మిత్రుడు రామనాథం 'ఒరే! నిన్ను మొదట్నుండీ చూస్తున్నా! అతితక్కువ సమయంలో చాలా ధనం సంపాదించావు. ఆర్థికంగా మంచి స్థాయికి చేరాక కూడా అంత పిసినారితనం మంచిది కాదు. కనీస అవసరాలక్కూడా ఉపయోగించని ధనం ఎందుకు? నీ కుటుంబ అవసరాలు తీర్చుకుంటూ పదిమందికీ చేతనైన సాయం చేసినప్పుడే నీ సంపదకు సార్థకత' అంటూ హితోపదేశం చేశాడు.
                                               * డి.కె. చదువుల బాబు, 9440703716