ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : జిల్లాలో పదేళ్లలో క్రమంగా వ్యవసాయ పంటలు తగ్గుతున్నాయి. ఒకప్పటి పచ్చని పంట పొలాలు బీడువారుతున్నాయి. చాలాచోట్ల రియల్ ఎస్టేట్ వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. సాగునీటి వనరులు లేకపోవడం, వర్షాలు కూడా అనుకూలించక పోవడం, పెట్టుబుడులు భారీగా పెరగడంతో పాటు పంటకు గిట్టుబాటు ధర, మార్కెట్ సదుపాయం వంటివి లేవు. ఈ నేపథ్యంలో చిన్నసన్నకారు రైతులు వలస కూలీలుగా మారారు. మధ్యతరగతి రైతులు కూడా సాగు విస్తీర్ణాన్ని తగ్గించుకుంటున్నారు. దీంతో జిల్లాలో ఉన్న కొద్దిపాటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా మూతపడ్డాయి. ప్రభుత్వాలు మారుతున్నా రాజకీయంగా జోక్యం చేసుకునే నాధులే లేకపోవడంతో జిల్లా పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి.
ఉమ్మడి విజయనగరం జిల్లా భౌగోళికంగా 16, 34, 750 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో వ్యవసాయానికి అనువుగావున్న భూమి 9,25,387.5 ఎకరాల వరకు ఉంది. జిల్లా వ్యాప్తంగా వరి, చెరకు, మొక్కజొన్న, పత్తి, మినుములు, పెసలు తదితర అపరాలు వంటి వ్యవసాయ పంటలు ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో కేవలం 3,41,130 ఎకరాల్లో మాత్రమే సాగయ్యాయి. ఇందులో అత్యల్పంగా ఉద్యాన పంటల సాగు కేవలం 1,67,902 ఎకరాల్లో మాత్రమే ఉంది. నాన్ ఫుడ్ క్రాప్ ఏరియా కూడా 23,096 (6శాతం) ఎకరాలుగా నమోదైంది. గతంలో పోలిస్తే ముఖ్యంగా వ్యవసాయ పంటలు క్రమంగా సాగు విస్తీర్ణం తగ్గుతోంది. 2016-17లో వరి, మొక్కజొన్న, పత్తి, చెరకు, గోగు తదితర వ్యవసాయ పంటల సాగు 6,92,245 ఎకరాల్లో సాగు కాగా, జిల్లాల పునర్విభజన (2020-21) నాటికి 5,79,437 ఎకరాలకు తగ్గింది. ఈ కాల వ్యవధిలో సుమారు 1,13,558 ఎకరాల మేర సాగు విస్తీర్ణం తగ్గినట్టుగా స్పష్టమౌతోంది. ఈలెక్కన సాగు విస్తీర్ణం కన్నా బీడువారుతున్న సాగుభూమి 2శాతం అధికంగా ఉండడం గమనార్హం. జిల్లాల విభజన అనంతరం (2021-22)లో విజయనగరం జిల్లాలో 4,72,257 ఎకరాల్లో వ్యవసాయ పంటలన్నీ సాగవ్వగా, ఈ ఏడాది కేవలం 2,74,065 ఎకరాల్లో మాత్రమే పంటల సాగు కనిపిస్తోంది. దీన్నిబట్టి గడిచిన మూడేళ్లలో 1,98,192 ఎకరాల మేర సాగువిస్తీర్ణం తగ్గిపోయింది. జిల్లాలో వ్యవసాయ రంగంపై సుమారు 80శాతం జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. కానీ, సాగునీటి వసతి కల్పించక పోవడం, ఉద్యాన పంటలను తగినంతగా ప్రోత్సహించకపోవడం, ప్రభుత్వం తరపున బోర్లు, బావులు మంజూరు చేయకపోవడం, మైక్రో ఇరిగేషన్ పథకాలు పూర్తిగా స్తంభించడం వంటి కారణావల్ల సాగు భూమి తగ్గుతోంది. లక్షా 30వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు తలపెట్టిన తోటపల్లి ప్రాజెక్టు మిగులు పనులు పూర్తికాకపోవడం వల్ల లక్ష్యం నీరుగారుతోంది. ఇప్పటికీ సుమారు 80వేల ఎకరాలకు మించి సాగునీరు అందడం లేదు. తారకరామ తీర్థసాగర్ చేపట్టిన దాదాపు 18ఏళ్లు దాటుతున్నా అతీగతీ లేదు. జంఝావతి ప్రాజెక్టు ప్రారంభించి నాలుగు పదులు దాటినా నేటికీ నాలుగు ఎకరాలకు మించి సాగునీరు అందడం లేదు. ఇక మైక్రో ఇరిగేషన్‌కు దాదాపు లక్ష్యం అనేదే లేకుండా పోయింది. దీనికితోడు వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు స్థానికంగా మార్కెట్ సదుపాయం కల్పించక పోవడం కూడా సాగుభూమి తగ్గుదలకు మరో కారణంగా చెప్పుకోవచ్చు. దీంతో, 2016-17 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 4,18,930 ఎకరాల మేర వ్యవసాయ పటల సాగు తగ్గింది. ఫలితంగా వ్యవసాయ రంగం ద్వారా జిల్లాకు కేవలం రూ.13,056 కోట్ల (40.09శాతం) ఆదాయం మాత్రమే వస్తోంది. ఈ ప్రభావం రైతులతోపాటు వ్యవసాయ రంగంపై ఆధారపడిన కార్మికులు, వృత్తిదారులపైనా పడింది. జిల్లాలో వలసలు ఏటేటా పెరుగుతున్నాయి.
పెరిగిన వరి సాగు.. దిగుబడి
జిల్లా ఖరీఫ్‌లోనే అత్యధిక పంటలు పండుతాయి. ఈ సీజన్‌లో ఉమ్మడి జిల్లాలోనూ, విభజిత జిల్లాలోనూ వరి విస్తీర్ణం, దిగుబడి పరిశీలిస్తే కాస్త పెరిగినట్టుగానే కనిపిస్తోంది. దీన్నిబట్టి గోగు, చెరకు, పత్తి, అపరాల పంటల సాగు ఘననీయంగా తగ్గినట్టు స్పష్టమౌతోంది. 2014-15లో 1,18,950 హెక్టార్లలో సాగవ్వగా 2021-22 నాటికి క్రమంగా 1,27,872 హెక్టార్లకు పెరిగింది. జిల్లా విభజన అనంతరం 2022-23లో 93,643 హెక్టార్లలో సాగవ్వగా 2023-24 ప్రస్తుత ఖరీఫ్‌లో 89,853 హెక్టార్ల వరకు సాగైంది. దిగుబడి కూడా 2014-15లో ఎకరాకు 1,602 కేజీల చొప్పున దిగుబడిరాగా జిల్లాలో 4,70,685 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అయ్యింది. 2021-22లో ఎకరాకు 2,004కేజీల చొప్పున దిగుబడి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 6,32,966 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యింది. విభజన జిల్లాలోనూ గత ఏడాది అత్యధికంగా 2,110 కేజీల చొప్పున దిగుబడి రాగా, జిల్లాలో మొత్తం ఉత్పత్తి 4,63,128 మెట్రిక్ టన్నులుగా నమోదైంది.
సంవత్సరం సాగు విస్తీర్ణం
ఎకరాల్లో
2023-24 2,74,065
2022-23 4,47,592
ఉమ్మడి జిల్లాలో
2021-22 4,72,257
2020-21 5,79,437
2019-20 5,82,967
2018-19 5,91,997
2017-18 6,69,245
2016-17 6,92,955
2015-16 6,83,525
2014-15 6,60,882
పెరిగిన వరి సాగు విస్తీర్ణం
సంవత్సరం సాగు విస్తీర్ణం
(హెక్టార్లు)
2022-23 93,643
ఉమ్మడి జిల్లాలో
2021-22 1,27,872
2020-21 1,18,868
2019-20 1,19,380
2018-19 1,21,499
2017-18 1,22,659
2016-17 1,22,205
2015-16 1,24,275
2014-15 1,18,950
పెరిగిన వరి దిగుబడి
సంవత్సరం కేజీలు జిల్లాలో దిగుబడి
(ఎకరాకు) (మె.టన్నులు)
2022-23 2,110 4,63,128
ఉమ్మడి జిల్లాలో
2021-22 2,004 6,32,966
2020-21 1,770 5,19,691
2019-20 1,974 5,82,336
2018-19 1,413 4,24,153
2017-18 1,807 5,47,607
2016-17 1,893 5,71,553
2015-16 1,791 5,49,917
2014-15 1,602 4,70,685










