Jul 24,2023 00:34

ప్రజాశక్తి-విజయపురిసౌత్‌, తాడేపల్లి : నాగార్జునసాగర్‌ జలాశయం నీటిమట్టం రోజురోజుకు తగ్గుతోంది. ఆదివారం సాయంత్రానికి 590 అడుగులకు గాను 516.70 అడుగుల వద్దకు చేరింది. ఇది 143.3273 టీఎంసీలకు సమానం. కుడి కాల్వకు 5088 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బిసికి 1350 క్యూసెక్కులు, మొత్తం నీటి విడుదల 6838 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మరోవైపు తాడేపల్లి ప్రకాశం బ్యారేజీ వద్ద నీరు నిలకడగా ఉంది. నానుడు వర్షాలతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని నదులు పొంగి పొర్లడంతో ప్రకాశం బ్యారేజీ వద్దకు వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీటి వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని ప్రకాశం బ్యారేజీ, ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. బ్యారేజీ ఏడు గేట్లను ఎత్తి 15 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. కృష్ణా పశ్చిమ, తూర్పు డెల్టా, బందరు, ఏలూరు కాలువలకు, గుంటూరు ఛానల్‌కు 7600 క్యూసెక్కులను విడుదల చేశారు.