Oct 07,2023 00:00

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : పశుపోషణ క్రమంగా తగ్గుతోంది. వేర్వేరు కారణాలతో గత ఐదేళ్ల కాలంలో పశుపోషణ తగ్గింది. గుంటూరు జిల్లాలో నాలుగేళ్ల క్రితం 26 వేల ఆవులు ఉండగా ప్రస్తుతం 16,899 ఉన్నాయి. వీటిల్లో ఉత్పాదక ఆవులు 5069 మాత్రమే ఉన్నాయి. గేదెలు రెండున్నర లక్షల నుంచి ప్రస్తుతం 1,98,009కు తగ్గాయి. గొర్రెలు, మేకలు తప్ప ఆవులు, గేదేలు సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. జిల్లాలో గొర్రెలు 1,25,451, మేకలు 20,451, కోళ్లు 33,65,423 ఉన్నట్టు అధికారుల అంచనా. పాలధరలు భారీగా పెరిగినా గేదెల పోషణ కష్టతరంగా మారింది. పాల ఉత్పత్తి సామర్ధ్యం తగ్గిపోవడం, పాలు ఆశించిన స్థాయిలో ఇవ్వకపోవడం, అనారోగ్యానికి గురవుతుండటంతో వీటిని పశువధ సంతలకు విక్రయిస్తున్నారు. పశు పోషణకు ప్రధానంగా గ్రాసం, ఇతర ఆహార పదార్ధాలు ధరలు గణనీయంగా పెరగడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఆకస్మికంగా సంభవిస్తున్న వ్యాధులు వల్ల కూడా పోషణకు రైతులు దూరం అవుతున్నారు.
గతంలో వ్యవసాయంతో పాటు పశుపోషణలో కూడా భాగస్వామ్యం అయ్యే రైతులు క్రమంగా ఈ రంగం నుంచి దూరం అవుతున్నారు. పశుపోషణ ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన అంశంగా మారడంతో చాలా మంది పశువులను పెంచేందుకు విముఖత చూపుతున్నారు. పశువులకు చికిత్సల నిమిత్తం పశువైద్య శాలలు అందుబాటులో ఉన్నా ఇప్పటి వరకూ ప్రభుత్వం తగినంత మందిని సిబ్బందిని నియమించి సకాలంలో చికిత్సలు అందించడంలో జాప్యం కారణంగా కొన్ని పశువులుగా ఆకాల మరణానికి గురవుతున్నాయి. పశుపోషకులకు కూడా తగిన చేయూత నిస్తామని సీఎం జగన్‌ గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఆర్‌బికేలకు అనుసంధానంగా పశుచికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసినా వెటర్నీరీ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయడం లేదు. జిల్లాలో 242 రైతు భరోసా కేంద్రాలు ఉన్నా వెటర్నరీ అసిస్టెంట్‌లతో కూడిన చికిత్స కేంద్రాలు 45 మాత్రమే ఉన్నాయి. వెటర్నీరీ అసిస్టెంట్‌ పోస్టులు 100కుపైగా ఖాళీలున్నాయి.
2019లో సచివాలయాల్లో ఈపోస్టుల భర్తీకి రాతపరీక్షలు నిర్వహించినా అర్హులైన వారు ఎక్కువ మంది లేకపోవడం వల్ల ఖాళీలు ఏర్పడ్డాయి. తరువాత మళ్లీ భర్తీకి ఉత్తర్వులు రాలేదు. గోపాలమిత్రల ఆధ్వర్యంలో పనిచేసే కేంద్రాలు 41 పనిచేస్తున్నాయి. వీటితో పాటు మరో 70 పశువైద్య కేంద్రాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. గతంలో పశు పోషణకు ఆసక్తి చూపే రైతులు వేర్వేరు కారణాలతో ఈ రంగం నుంచి తప్పుకుంటున్నారు. గత నాలుగేళ్లలో 14,649 మంది రైతులకు చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,750తో మహిళలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఒకేచోట భారీ పోషణ కేంద్రాలు ఆవిర్భవిస్తున్నాయి. గతంలో ఒక్కో ఇంటిల్లో మూడు నాలుగు గెదేలు, లేక ఆవులు ఉండేవి. ఇప్పుడు ఒకేచోట 50 నుంచి 100 వరకు వివిధ జాతుల పశువులను పోషణతో పాల ఉత్పత్తి కేంద్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇవి క్రమంగా మినీ డెయిరీలుగా ఆవిర్భవిస్తున్నాయి.