
ప్రజాశక్తి-చోడవరం
చెరుకు సాగు నుండి రైతులు ఏడాదికి ఏడాది దూరమవుతున్నారు. పెట్టుబడులు పెరిగిపోవడం, గిట్టుబాటు లేకపోవడం, దిగుబడులు తగ్గడం, ప్రభుత్వం రైతుల పట్ల పూర్తి నిర్లక్ష్యం వహించడం, వీటికి తోడు కూలీలు కొరత వంటివి చెరుకు సాగుకు రైతును దూరం చేస్తున్నాయని చెప్పవచ్చు. రాష్ట్రంలోని ఉమ్మడి విశాఖ జిల్లాలో చెరుకు ప్రధానమైన వ్యాపార పంట. జిల్లాలో గతంలో గోవాడ, ఏటికొప్పాక, తాండవ, తుమ్మపాల నాలుగు చక్కెర కర్మగారాల్లో సుమారుగా 11 లక్షల 50 వేల టన్నులు చెరుకు క్రషింగ్ జరిగేది. రాను రాను ప్రభుత్వ ప్రోత్సాహకం కరువు అవడంతో అనేక సమస్యలు ఎదుర్కొంటూ మూడు ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. గోవాడ ఆర్థిక నష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. ఏడాదికి ఐదు లక్షల 50 వేలు టన్నులు క్రషింగ్ సామర్థ్యం ఉన్న ఫ్యాక్టరీ నేడు రెండు లక్షల టన్నులకు పడిపోయింది. అనకాపల్లి, చోడవరం, మాడుగుల, నర్సీపట్నం నియోజకవర్గాల పరిధి 32 వేల ఎకరాల్లో చెరుకు సాగు అయ్యేది. ప్రస్తుతం ఈ సంఖ్య ఎనిమిది వేల ఎకరాలకు చేరుకుంటుందని అధికారులు చేస్తున్నారు.
సాగుకు అపారమైన ఖర్చు. ఎకరా చెరుకు తోటకు ప్రాథమిక దశ నుండి దుక్కుకు 6000 రూపాయలు, చెరుకు విత్తనకు రూ.12000, నాట్లకు, రూ.6000, ఎరువులు పురుగుమందుకు రూ.4000, గొప్పులకు రూ.8000, జడ చుట్టుటకు మూడు దఫాలకు రూ.9000, చెరుకు తయారైన తర్వాత ఫ్యాక్టరీకి తరలించడానికి తన్నుకు వాహన కూలీలు ఖర్చు రూ.1200 వరకు ఖర్చు అవుతుంది. సరాసరి ఎకరాకు 30 టన్నులు చెరుకు దిగుబడి అయితే రూ.36 వేల వరకు ఈ ఖర్చులు అవుతాయి. ఎకరా చెరుకునాటి ఇంత చేతికి వచ్చేవరకు సుమారు 70 వేలకు పైబడి ఖర్చు అవుతుంది. ఉడుపుతోటకు ఖర్చు అధికమైన రెండవ యాడాది వచ్చే కార్సీ తోటలకు చీడపురుగులు ఆశించి నిలువునా ఎండిపోవడంతో నష్టాలు మరింత ఎక్కువయ్యాయి. సరాసరి దిగుబడి ఎకరాకు 30 టన్నులు లెక్కన ఫ్యాక్టరీ చెల్లించే టన్నుకు 2500 చొప్పున 75000 వస్తుంది. అది కూడా ఫ్యాక్టరీలు సకాలంలో చెల్లించడం లేదు. గత సీజన్‌లో చెరుకు సరఫరా చేసిన రైతులకు మూడు నెలల కావస్తున్న ఇంకా అందరికీ బిల్లులు బట్వాడా జరగలేదు. ప్రభుత్వం చెరుకుకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో చెరుకు పంట పూర్తిగా దివాలా సాగుగా తయారైందని రైతులు అంటున్నారు.
గత మూడు సంవత్సరాలుగా అనకాపల్లి బెల్లం మార్కెట్ లో బెల్లం ఎగుమతులు క్షీణించడంతో జిల్లాలో విరివిగా బెల్లం తయారు చేసే కొన్ని ప్రాంతాల చెరుకు రైతులు సాగుకు దూరమవుతున్నాను. వ్యవసాయాన్ని వదిలి యువకులు తక్కువ వేతనాలైనా ఫార్మసిటీ కంపెనీలకు వెళ్లవలసిన గత్యంతరం ఏర్పడింది. గత ప్రస్తుత ప్రభుత్వాలు చెరుకు రైతులకు హామీలు ఇచ్చాయి తప్ప అవసరాలు తీర్చలేకపోయాయి. ప్రభుత్వాలు అందిస్తున్న అరకొర భరోసాలతో సేద్యం సాధ్యం కాదని రైతులు అంటున్నారు.