Sep 30,2023 20:57

సీతారామపురం వద్ద సాగులో ఉన్న పసుపు పంట

చాపాడు : దేశంలోని ముఖ్యమైన వ్యవసాయ ఉత్పత్తుల్లో పసుపు ఒకటి. దేశీయ వినియోగంతో పాటు కొన్ని వేల టన్నులను విదేశాలకు ప్రతి సంవత్సరమూ ఎగుమతి చేయడంతో పాటు, మందుల తయారీలో, రంగులలో, సౌందర్య సాధనాలలో, అధికంగా ఉపయోగిస్తారు. భారతీయ సంస్కతిలో పసుపునకు మంచి స్థానం ఉంది. ప్రతి కార్యక్రమంలో పసుపును తప్పక వాడతారు. పసుపు సాగులో భారతదేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది. పసుపు ఉత్పత్తిలో 80 శాతం వరకు మన దేశానిదే. దేశీయ ఉత్పత్తిలో 40 శాతం వాటా మన ఆంధ్రప్రదేశ్‌ది. మన రాష్ట్రంలో గతంలో సుమారు 16 800 హెక్టార్లలో పసుపు సాగు చేస్తూ 146000 మెట్రిక్‌ టన్నుల దిగుబడి సాధించేవారు. అది కూడా కడప, గుంటూరు జిల్లాలో ముఖ్యంగా పసుపు సాగు సాగు చేసేవారు.
గతంలో ఉమ్మడి కడప జిల్లాలోని 21 మండలాల్లో 12500 ఎకరాల్లో రైతులు సాగు చేసేవారు. రెండేళ్ల కిందట ఉమ్మడి కడప జిల్లాలో మండలాల వారీగా హెక్టర్‌లలో పసుపు సాగును పరిశీలిస్తే మైదుకూరులో 670, దువ్వూరులో 490, చాపాడులో 283, ఖాజీపేటలో 520, బి. మఠంలో 78, సికె దిన్నెలో 413, పెండ్లిమర్రిలో 62 , మైలవరంలో 175, జమ్మల మడుగులో 90, కాశీనాయన లో 370, పోరుమామిళ్లలో 235, కలసపాడు లో 75, ఒంటి మిట్టలో 210, సిద్ధవటం లో 330, నందలూరులో 156, చిట్వేలు 52, పుల్లం పేటలో 88, ఓబులవారిపల్లిలో 19, రాజంపేటలో 142, రైల్వేకోడూరులో 85, రాజుపాలెంలో 40 హెక్టార్లు సాగు అయ్యేది. ప్రతి ఏడాది సాగు ఖర్చులు పెరగడం, దిగుబడి తగ్గడంతో జిల్లాలో ఏటా వందల ఎకరాలు పసుపు సాగు తగ్గుతూ వస్తుంది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 3500 ఎకరాల్లో మాత్రమే పసుపు పంట సాగు అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మైదుకూరు, దువ్వూరు, చాపాడు, ఖాజీపేట మండలంలో సాగుకు రైతులు అనాశక్తి చూపు తున్నారు. ఈ ఏడాది మార్కెట్‌లో వ్యాపారులు ప్రారంభంలో రూ.4500 కొను గోలు చేసి, రైతులు పసుపు దిగుబడిని పూర్తిగా అమ్ముకున్న తరువాత ధరలు అమాంతం పెంచారు. ఇలాంటి పరిస్థితుల్లో పసుపు పంట సాగు చేసే నష్టాల్లో కూరుకుపోవడంతో ఎందుకని రైతన్నలు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.
నిలకడగా లేని ధరలు...
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సిఎసిపి వారు పసుపు పంటకు కనీస మద్దతు ధర, గిట్టుబాటు ధర నిర్ణయించడం లేదు. జిల్లాలోని స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీ లో పసుపు పంటకు మార్కెట్‌ సౌకర్యం ఉంది. .మన రాష్ట్రంలో మన జిల్లాతో పాటు దుగ్గిరాల మార్కెట్‌ యార్డులో అమ్మకాలు జరుపుతారు .ధరల నిర్ణయం పూర్తిగా వ్యాపారస్తులదే. పసుపు గ్రేడింగ్‌ అధికారులు మాత్రం నామమాత్రంగా అందుబాటులో ఉంటున్నారు. సరైన గిట్టుబాటు ధరలు వచ్చేంతవరకు నిల్వ ఉంచుకునేందుకు నిల్వ సౌకర్యం అందుబాటులో లేదు. గత ఏడాది సాగైన పంటకు ప్రభుత్వం క్వింటాకు రూ. 6750 గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వ ఆధ్వర్యంలో పసుపు పంటను కొనుగోలు చేశారు. అయితే ప్రభుత్వం పసుపు సేకరించిన తరువాత మార్కేట్‌లో క్వింటా రూ. 10వేలకు పైగా పలికింది.
ప్రతి ఏడాదీ తగ్గుతున్న పసుపు సాగు..
దువ్వూరు మండలంలో పసుపు పంట సాగును గమనిస్తే 2018 -2019లో 2500 ఎకరాలు మండలంలో పసుపు పంట సాగు చేయగా ,2019- 2020లో 1800 ఎకరాలు సాగు చేశారు. 2020-2021లో 900 ఎకరాలు, 2021 -22 లో 550 ఎకరాలు, ప్రస్తుతం 290 ఎకరాలలో మాత్రమే పసుపు పంట సాగు చేశారు. జిల్లెల్ల, కానగూడూరు ,పెద్ద జొన్న వరం, రామ సాయి నగర్‌, గుడిపాడు, భీమునిపాడు, రామాపురం, వెంకుపల్లి, సి. ఎస్‌ పల్లి, మది రేపల్లె, సంజీవ రెడ్డి పల్లి ప్రతి సంవత్సరం పసుపు పంట తగ్గుతూ వస్తుందని ఉద్యానశాఖ అధికారులు తెలుపుతున్నారు. చాపాడు మండల పరిధిలోనూ పసుపు సాగు గణనీయంగా తగ్గుముఖం పట్టింది. గత ఏడాది 195 మంది సాగు చేపట్టగా ఈ ఏడాది వంద మందికి పరిమితమైంది. పసుపు పంట దిగుబడి తగ్గుతుండటం, గిట్టుబాటు ధర లేకపోవడం, 10నెలల పాటు పంటకు సంరక్షణ చేయాల్సి ఉండటంతో నష్టాలు వస్తున్నాయని అందువల్లే వేరే పంటలపై మొగ్గుచూపుతున్నట్లు రైతులు తెలుపుతున్నారు. పండిన పంటకు మద్దతు ధర ప్రకటించలేదని, ప్రభుత్వం కొనుగోలు పూర్తి చేయటం లేదని , ధరలు నిలకడగా ఉండటం లేదని రైతులు ఆందోళన చెందు తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మద్దతు ధర రూ.9 వేల నుంచి రూ.10 వేల కేటాయించాల్సిందిగా పసుపు పండించే రైతులు కోరుకుంటున్నారు.
సాగు ఖర్చులు అధికమవుతున్నాయి..
పసుపు పంట సాగుకు ఎకరాకు రూ. 80 నుంచి రూ. లక్ష వరకు ఖర్చు అవుతున్నాయి .దిగుబడి మాత్రం 30 నుంచి 35 క్వింటాళ్లు మాత్రమే వస్తుంది. ప్రస్తుతం ఉన్న ధరలకు సాగు ఖర్చులు కూడా రావడం లేదు. రూ.10,000 వరకు పసుపు పంటకు ధరలు ఉంటే ఖర్చులు పోను కాస్త మిగులుతుంది .ప్రభుత్వం పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి.
- రామసుబ్బారెడ్డి, రైతు, సీతారామపురం.

ధరలు లేక సాగు తగ్గించాం..
గతంలో నాలుగు నుంచి ఐదు ఎకరాలలో పసుపు పంటను సాగు చేపడుతూ ప్రస్తుతం తగ్గించాం. ప్రతి ఏడాది గిట్టుబాటు ధర లేక నష్టాలు మిగులుతున్నాయి. దీంతో పసుపు పంట సాగుకు ఆసక్తి తగ్గింది. పసుపు పంట ఏడాదిపాటు సంరక్షించు కోవాల్సిన అవసరం ఉంది. గిట్టుబాటు ధర లేకపోవడంతో ఇతర పంటలపై ఆధార పడుతున్నాం.
-మనోహర్‌రెడ్డి, చాపాడు.