Feb 21,2023 21:10

కుప్పలుగా పోసిన పప్పు శనగ ధాన్యం

తగ్గిన పప్పు శనగ దిగుబడి
- పడిపోయిన ధర
క్వింటా ధర రూ.4500 మాత్రమే
- పెట్టుబడులు అధికం - రాబడి శూన్యం..
- అప్పుల పాలవుతున్న రైతులు
ప్రజాశక్తి - అవుకు

       అవుకు మండలంలో వ్యవసాయం ప్రధాన వనరు. వ్యవసాయాన్ని నమ్ముకొని రైతులు, వ్యవసాయ కూలీలు జీవిస్తున్నారు. మండలంలో రబీ సీజన్‌లో సాగు చేసిన పప్పు శగన పంట దిగుబడి సగానికి పైగా పడిపోయింది. కనీసం పంట సాగు కోసం పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా రైతులు పంటల సాగుకు పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనోవేధనకు గురవుతున్నారు.
మండలంలో పప్పు శనగ పంటను 5,625 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. పప్పు శనగ పైరును సాగు చేసినప్పటి నుండి ఒకవైపు అధిక వర్షాలు, మరోవైపు వివిధ రకాల తెగుళ్లతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు పంట దిగుబడిపై ప్రభావం చూపి పూర్తిగా తగ్గిపోయింది. గతంలో ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్లు దిగుబడి వచ్చేది. ప్రస్తుతం 4 నుండి 5 క్వింటాళ్లు దిగుబడి మాత్రమే వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగు కోసం ఎకరాకు సుమారు 20 వేల రూపాయలు ఖర్చు చేశారు. ప్రస్తుతం వచ్చిన అరకొర దిగుబడికి సైతం ధర కూడా ఆశించినంత మేర లేకపోవడంతో నష్టాలు చవిచూడాల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పప్పు శనగ క్వింటా ధర రూ. 4500 పలుకుతుంది. ఈ లెక్కన వేసుకున్నా ఎకరాకు వచ్చే దిగుబడికి ప్రస్తుత ధరకు సరిపోతున్నా రైతు శ్రమంతా వృధా అవుతోంది. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కొందరి రైతులకు పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఉంది. పంటలు ఈ విధంగా వస్తే ఎలా జీవించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పప్పు శనగకు తెలిపిన మద్దతు ధరతో కొనుగోలు చేసి ఆదుకోవాలని మండల రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పప్పు శనగలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలి. ప్రస్తుతం క్వింటా ధర రూ.4,500 పలకడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. ప్రభుత్వం తెలిపిన మద్దతు ధర క్వింటా రూ.5300లతో కొనుగోలు చేస్తే రైతుకు కొంతమేర ఊరట లభిస్తుంది.
చంద్రశేఖర్‌ రెడ్డి, చెన్నంపల్లె గ్రామం రైతు.

ఆశించినంత దిగుబడి రాలేదు
పప్పు శనగ పంట దిగుబడి ఆశించినంత మేర రాలేదు. దీంతో తీవ్రంగా నష్టపోయాం. ఎకరాకు 4 నుండి 6 క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడి వచ్చింది. ప్రస్తుతం రూ.4500 ధరతో దళారులు కొనుగోలు చేస్తున్నారు. దీనివలన రైతుకు నష్టం వాటిల్లుతోంది. వెంటనే ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలి.
వీరారెడ్డి, సంఘపట్నం గ్రామం రైతు.

రైతులను ఆదుకోవడంలో వైసిపి విఫలం
వైసిపి రైతు ప్రభుత్వమని చెప్పుకుంటుందే తప్ప రైతులకు చేసింది ఏమీ లేదు. మండలంలో రైతులు సాగు చేసిన పప్పు శనగ పంట ఆశించినంత మేర దిగుబడి రాకపోవడం, ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. పంట సాగుకు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. టిడిపి ప్రభుత్వ హయాంలో రైతులకు మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేవారు. వైసిపి ప్రభుత్వం మద్దతు ధర రూ.5300 ప్రకటించినప్పటి కూడా ఇంతవరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. గతేడాది కొనుగోలు చేసినా 5 నెలల నుంచి 6 నెలల వరకు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం చాలా దారుణం. ప్రభుత్వం ఇప్పటికైనా పప్పు శనగ రైతులను దృష్టిలో పెట్టుకుని మద్దతు ధర ఇంకా కొంత మేర పెంచి వెంటనే కొనగోలు చేసి డబ్బులు త్వరగా ఖాతాలో జమ చేసి ఆదుకోవాలి.
గూడాల మురళీధర్‌ రెడ్డి, టిడిపి నాయకులు, కునుకుంట్ల గ్రామం.