'ఆహా ఏమి రుచి అనరా మైమరచి' అని లొట్టలేసుకుంటూ... తినని భారతీయుడు...ముఖ్యంగా ఆంధ్రుడు వుండడంటే అతిశయోక్తి కాదు. విందుల్లోనైనా... ఇంట్లోనైనా... నచ్చిన వంటకం వాసన నాసికను తాకితే చాలు...ఎప్పుడెప్పుడు తినాలా అని నాలుక నాట్యమాడుతుంది. అందుకే మరి... 'వివాహ భోజనంబు వింతైన వంటకంబు../ వియ్యాల వారి విందు...హహహ నాకె ముందు' అంటూ విందు భోజనాలకూ ముందు వరుసలో వుంటాం. ఇప్పుడా అనుభూతిని దూరం చేస్తున్నాయి ఆకాశాన్నంటే ధరలు. ఒక్కటేమిటి...పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల నుంచి నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరల వరకూ అన్నీ సామాన్యుడికి అందనంత దూరంలోనే వున్నాయి. అప్పట్లో... 'ఏం కొనేటట్టులేదు, ఏం తినేటట్టులేదు, నాగులో నాగన్న/ ధరలిట్టా పెరగబట్టె నాగులో నాగన్న/ ధరల మీద మనుబొయ్య నాగులో నాగన్న!' అంటూ పెరిగిన ధరలపై పాటలు కట్టేవారు. దాదాపు నలభైయ్యేళ్ల క్రితం వచ్చిన 'వేయి చేతులు కలపండీ' అనే నాటికలో తెర తీయగానే వైకుంఠం అనే వ్యక్తి పైకి చూస్తూ వెతుకుతుంటాడు. కైలాసానికి ఏమీ అర్థంకాక 'ఏమిటీ అక్కడేమున్నాయి?' అని ప్రశ్నిస్తాడు. 'అదుగో సరుకుల ధరలు...ఆ చుక్కల్లో కనపడుతున్నాయా!?' అని ఎదురు ప్రశ్న వేస్తాడు. అప్పుడు పైసల్లో పెరిగిన ధరలు...ఇప్పుడు వందల్లో పెరుగుతూ... ఆ చుక్కలనే దాటి పోటీపడుతున్నాయి.
ప్రస్తుతం సగటు మనిషి జీవితమంతా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ చుట్టే తిరుగుతోంది. ఒకవైపు నిత్యావసర ధరలు... మరోవైపు కూరగాయల రేట్లు సామాన్యులను వణికిస్తున్నాయి. ఆకు కూరల ధరలు సైతం ఆకాశంలో విహరిస్తున్నాయి. 'మెత్త వంకాయలతో చట్నీ చేసేదా/ టమాటాతో కలిపీ వండిపెడితే మీరూ/ అన్నమంత వదిలేసీ ఒట్టి కూర తింటారు...' అంటాడు సినీకవి సీతారామ శాస్త్రి. ఇప్పుడసలు సామాన్యులు టమాటాలు కొనే పరిస్థితే లేదు. క్రిసిల్ అధ్యయనం ప్రకారం... ప్రస్తుతం కిలో రూ.100 వరకు ఉన్న టమాటా ధర...మరో రెండు నెలల వరకు 'తగ్గేదేలే...!' అంటోంది. మిగతావాటి పరిస్థితీ అదేవిధంగా వుంది. దీనివల్ల సామాన్యులపై 30 నుంచి 40 శాతం వరకు అదనపు భారం పడుతోంది. ప్రతి మనిషీ రోజూ 165 గ్రా. కూరగాయలు తినాలని న్యూట్రిషియన్లు సూచిస్తున్నారు. అయితే ఆ మేరకు ప్రజలు తింటున్నారా అంటే... లేదనే చెప్పాలి. మహిళల్లో 57 శాతం మంది రక్తహీనతను ఎదుర్కొంటుండగా.. ఆరు నెలల నుండి ఐదేళ్లలోపు పిల్లల్లో 67.1 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5) వెల్లడించింది. రక్తహీనత మొత్తం ఆరోగ్యంపైనే ప్రభావం చూపిస్తుంది. ఈ సమస్య దేశంలో 14 రాష్ట్రాల్లో అత్యధికంగా వుంది. కరోనాతో ఉపాధి కోల్పోయి, ఆదాయాలు పడిపోయి...సామాన్యుల ఆహార వినియోగం తగ్గిపోయింది. ఒక్కపూట భోజనంతో, సగం కడుపుతో జీవనం కొనసాగిస్తున్న ప్రజలు ఈ దేశంలో సగానికి పైగా వున్నారు. ముఖ్యంగా ధరల పెరుగుదల వల్ల కుటుంబంలో ఎక్కువగా ఒత్తిడికి, ఆహారలేమికి గురయ్యేది మహిళలే. కాగా, కనీస మద్దతు ధరలేక రైతులూ దోపిడీకి గురవుతున్నారు.
'ఆకాశం అంటుకునే ధరలొకవైపు/ అంతులేని నిరుద్యోగమింకోవైపు/ అవినీతి, బంధుప్రీతి చీకటి బజారు/ అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు' అంటూ ఆవేదన చెందాడు మహాకవి శ్రీశ్రీ. పెట్రోలు, డీజిల్ ధరలు రోజూ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో నిత్యావసరాల ధరలూ పెరిగాయి. ఇవి పండించే రైతు కూడా గిట్టుబాటు ధరలేక, తాను కొనుక్కోలేక ఆకలితో మాడుతున్నాడు. కరోనా పుణ్యమాని... ప్రాణాలను కాపాడే మందుల ధరలు సైతం గతం కంటే రెట్టింపయ్యాయి. ధరలు పెరగడం చాలా సహజం అన్నట్లుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తుంటే, అంబానీ, అదానీ లాంటివాళ్లు వేలకోట్లలో తమ ఆదాయాలు పెంచుకుంటున్నారు. దేశానికి తిండిపెట్టే రైతులు ఏడాది పాటు నిరసన తెలిపినా పట్టించుకోని మోడీ, రాష్ట్రంలో ఒకరినొకరు దూషణలతో కాలం గడుపుతోన్న పాలకులు ప్రజల్ని ఎప్పుడో గాలికొదిలేశారు. ఇప్పుడు కావాల్సింది... పాలకులను ప్రశ్నించే చైతన్యం. 'ధరలు దించండి!' అని నినదించే గళాలు. ప్రజలు, ప్రజా సంఘాలు ఉద్యమ కెరటాలై ఎగసిపడాలి. నింగినంటిన ధరలను నేలకు దించేలా ఒత్తిడి పెంచాలి.










