Apr 10,2022 06:52

''తగ్గేదే లే'' డైలాగ్‌ ఇప్పుడు ట్రెండింగ్‌లో వుంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగుల్లో బాగా పాపులరైన వాటిలో ఇదొకటి. హీరో ఈ డైలాగ్‌ చెబుతుంటే ఫాన్స్‌కు మాంచి హుషారు కలుగుతుంది. తగ్గడం అంటే అక్కడ ఏ అర్ధంతో అన్నాడో అటుంచితే... నిజ జీవితంలో ప్రస్తుతం ఏ వస్తువును తాకినా ''తగ్గేదే లే...మా ధరలు తగ్గించేదే లే....' అంటూ బుసలు కొడుతున్నాయి. సినిమాలో డైలాగులను ఎంజారు చేయొచ్చు. కానీ వాస్తవంగా ధరలు తగ్గేదే లే అంటే నిజ జీవితంలో మన పరిస్థితి ఏంటి? సామాన్యుడి నుండి మధ్యతరగతి పౌరుడి వరకు బతికేదెలా? అన్న చింతతో ఉన్నారు. ఈ ధరలు తగ్గించలేమా! అసలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయో కూడా తెలియని సామాన్యులు వెర్రి పుష్పాల్లా, అచేతనంగా ఉండిపోవడమేనా...?
    ఎడా పెడా పెరుగుతున్న ఇంధన, చమురు ధరలు చూస్తుంటే మన ప్రధాని మోడీ గారు జి.డి.పి. శరవేగంగా పెరుగుతోందని చెప్పిన మాటలకు అర్ధాలను వెతుక్కోగలిగామనిపిస్తోంది. జి-అంటే గ్యాస్‌ ధర, డి-అంటే డీజిల్‌, పి-అంటే పెట్రోల్‌ ధరలు శరవేగంగా పెరగడం అని ఇప్పుడు అర్ధమయ్యింది. జిడిపి పెరుగుదల అటుంచి, మోడీ గారి జిడిపి ఆంతర్యానికి తగ్గట్టే చమురు ధరలు అమాంతంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. పెట్రో ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో హెచ్చుతగ్గులను బట్టి ధరలు దానంతట అదే నిర్ణయించబడతాయని చెబుతోంది బిజెపి ప్రభుత్వం. గత 15 రోజులలో పెట్రోల్‌ 14 సార్లు పెరిగి 105 నుండి 120కి పెరిగింది. ఇటీవలె వంట గ్యాస్‌ ధర 14 కేజీల బండ రూ.50 పెరగగా, 19 కేజీల సిలిండర్‌ ధర రూ.250 కేంద్ర బిజెపి ప్రభుత్వం పెంచింది. దీనివల్ల రవాణా రంగంపైన, వర్తక, వాణిజ్యంపైన, మనం వాడే ప్రతి వస్తువు ధర పెరుగుదలకు ఊతం ఇచ్చారు. ఎక్కడో ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతుంటే మన ఊళ్లో వంట నూనెల ధర పెరిగిపోవడం ఏమిటని అనుకున్నా, వీటిని అదుపు చేయాల్సిన ప్రభుత్వాలు ఆ పని చేయడంలో విఫలమయ్యాయి. పెట్రోలియం ఉత్పత్తుల వాస్తవ ధర కంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులే ఎక్కువ. మోడీ గారు అధికారంలోకి వచ్చిన ఈ 8 ఏళ్లలో పెట్రోల్‌ ఉత్పత్తుల ద్వారా పన్నుల రూపంలో ప్రజల నుండి చేసిన వసూళ్లు అక్షరాలా రూ. 26 లక్షల కోట్లు. ఇంత పెద్ద మొత్తంలో ఒక్క పెట్రోల్‌ ఉత్పత్తుల పైనే ప్రజలపై భారాలు మోపిన బిజెపి ప్రభుత్వం, దేశీయ పెట్టుబడిదారులకు దాదాపు ఈ కాలంలో రూ.11 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసింది. దీన్నిబట్టే మోడీజీ సేవలు ప్రజల కోసమా పెట్టుబడిదారుల కోసమా అనేది అర్ధమౌతోంది. కానీ మరోవైపు నేను ఏది చేసినా దేశం కోసం, ప్రజల కోసం అని బాజా వాయించుకుంటుంటారు.
    ఇంకోవైపు టోల్‌ ఫీజుల పెంపుతో తోలు తీస్తున్నారు. నేషనల్‌ హైవేలపై తిరిగే అన్ని రకాల వాహనాలపై 10 నుండి 15 శాతం టోల్‌ చార్జీలు పెంచుతున్నట్లు నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. దీని ప్రకారం వాహనాల సామర్థ్యాన్ని బట్టి వాహనానికి రూ.10 నుండి రూ.60 వరకు చార్జీలు పెంచుతూ నిర్ణయం చేశారు.
     మందుల ధరలనూ పెంచారు. కోవిడ్‌ భయాలు ఇంకా పోకముందే మందుల ధరల పెంచేశారు. పారాసిట్మాల్‌ టాబ్లెట్‌తో సహా 800 రకాల నిత్యావసర మందుల ధరలను 10.7 శాతం గరిష్టంగా పెంచి ఏప్రిల్‌ నెల నుండి అమలు చేసేందుకు నేషనల్‌ ఫార్మాసుటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ ఈ మందుల ధరల సూచీని ప్రభుత్వానికి నివేదించింది. సామాన్యులతో పాటు అత్యధికంగా మందులు వాడే వారు, రిటైర్‌ అయి పెన్షన్లతో బతికే సినియర్‌ సిటిజన్లపై ఈ మందుల ధరల భారం మరింత పెరుగుతుంది.
    కేంద్ర బిజెపి ప్రభుత్వం వేస్తున్న పన్నుల పోటునే తట్టుకోలేకపోతుంటే, రాష్ట్ర వైసిపి ప్రభుత్వం కూడా సామాన్యులే టార్గెట్‌గా బాదుడే... బాదుడు... అని ఎక్కడా తగ్గడం లేదు. కరెంట్‌ చార్జీల విషయంలో ఇప్పటి వరకు ఉన్న పాత విధానాన్ని రద్దు చేసి కొత్తగా 6 రకాల శ్లాబుల రూపంలో ధరలు నిర్ణయించడం, క్యాటగిరీలలో మార్పు చేయడం ద్వారా భారీగానే వడ్డించింది. దీంతో ఒక్క సారిగా సామాన్యులకు 20 నుండి 40 శాతం మేర భారం పడుతుంది.
    ఎన్నడూ లేని విధంగా చెత్త పన్నుల భారాన్ని కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో జగన్‌ ప్రభుత్వం సామాన్యుడిపై మోపింది. కట్టకపోతే పెన్షన్ల నుండి కట్‌ చేసి మరీ ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నది. దీనికి తోటు ఇంటిపన్నుని ఆస్థి విలువ ఆధారంగా పెంచడం, మురుగు నీటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను ...ఇలా అనేక పన్నులను కూడా బిజెపి ప్రభుత్వానికి కంటే ఎక్కడా ''తగ్గేదే లే'' అని జగన్‌ ప్రభుత్వం వేస్తోంది. ఇక రిజిస్ట్రేషన్‌ చార్జీలు, వాహన ట్యాక్స్‌లు సరే సరి. ఇలా సంపాదించిందల్లా ఈ ధరలకి, పన్నులకే పోస్తే భవిష్యత్‌ ఎలాగా అని కుంగిపోతున్న సామాన్యు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వీరిని ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇంకా మరిన్ని భారాలు ఎలా వేయాలా అని ఆలోచిస్తున్నాయి. భవిష్యత్‌లో మరిన్ని భారాలకు సిద్ధమైపోవాల్సిందేనని చెబుతున్నాయి.
    ఈ ధరల పెరుగుదల చూస్తుంటే ఎప్పుడో పాతికేళ్ల క్రితం ఆర్‌. నారాయణమూర్తి ''ఎర్రోడు'' సినిమాలో ''ఏం కోనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు, నాగులో నాగన్న...'' పాటను నేడు బిజెపి, వైసిపి ప్రభుత్వాలు అక్షరాలా మరోసారి నిరూపిస్తున్నాయనిపిస్తోంది. ఈ పాటను, ఆ పోరుబాటను గుర్తుకు తెచ్చుకుని తిరుగుబాటుకు సిద్ధమౌతారా! మనం ఏం చేసినా తగ్గించే పరిస్థితి లేదని సరిపెట్టుకుంటారో ప్రజలే తేల్చుకోవాలి.

( వ్యాసకర్త సెల్‌ : 94900 98799 )
వి.వి.శ్రీనివాసరావు

srinivasarao