Feb 18,2023 23:22

తుమ్మపాల వివి.రమణ సహకార చక్కెర కర్మాగారం (ఫైల్‌ఫొటో)

ప్రజాశక్తి -అనకాపల్లి
సహకార రంగంలో దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన తుమ్మపాల వివి.రమణ సహకార చక్కర కర్మాగారం చరిత్ర తెరమరుగు కానుంది. జిల్లాలోనే అత్యంత పురాతన ఫ్యాక్టరీగా రైతుల మూలధనంతో సహకార రంగంలో నేటి వరకు కొనసాగింది. ఈ ఫ్యాక్టరీని విక్రయించేందుకు పలు దఫాలు ఆయా ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి. ఫ్యాక్టరీకి నష్టాలు వస్తున్నాయని మిషతో గత తెలుగుదేశం ప్రభుత్వం విక్రయించేందుకు ప్రయత్నించగా అప్పట్లో చెరకు రైతులు, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించి ఆందోళన చేపట్టడంతో వెనక్కు తగ్గింది. గత నాలుగేళ్లుగా సుగర్‌ ఫ్యాక్టరీ క్రషింగ్‌ జరపలేదు. ఫ్యాక్టరీని మూత వేయడంతో రైతుల పేమెంట్లు, కార్మికుల జీతాల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తుమ్మపాల ఫ్యాక్టరీని ఆధునికీకరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఫ్యాక్టరీకి పూర్వ వైభవం వస్తుందని ఈ ప్రాంతీయులు, కార్మికులు, రైతులు ఎంతో ఆశపడ్డారు. ఫ్యాక్టరీపై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 15 వేల కుటుంబాలు ఆధారపడి ఉండేవి. ఇప్పుడు ఫ్యాక్టరీని ఆధునికీకరించకపోగా, ప్రస్తుతం ఫ్యాక్టరీ అప్పులు, ఆస్తులు నిర్ణయించేందుకు సుగర్‌ కేన్‌ కమిషనర్‌ లిక్విడేటర్‌ను నియమించారు. ఫ్యాక్టరీలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో సుగర్‌ కేన్‌ కమిషనర్‌ శనివారం లిక్విడేటరు పివిఎస్‌ శాస్త్రిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేయగా, ఆయన బాధ్యతలు చేపట్టారు. దీంతో లిక్విడేషన్‌ ప్రాసెస్‌ చేసేందుకు ఆయన సంసిద్ధులవుతున్నారు. ఆయన ఇచ్చిన నివేదికపై ఆధారపడి ఫ్యాక్టరీ ఆస్తులను అమ్మి అప్పులు తీర్చగా మిగిలిన సొమ్ము సభ్య రైతులకు అందజేసే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ సుగర్‌ ఫ్యాక్టరీ తెరమరుగు కావడం తథ్యం.