
కురుపాం: రానున్న పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఐటిడిఎ పిఒ సి. విష్ణుచరణ్ తెలిపారు. గురువారం జియ్యమ్మవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు. విద్యార్థుల నోట్ పుస్తకాలు పరిశీలించి పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని, శతశాతం ఉత్తీర్ణతతో పాటు ప్రతి ఒక్కరూ 80శాతం మార్కులు సాధించాలని తెలిపారు. అనంతరం వసతిగృహంలో వంటగది, మరుగుదొడ్లు తనిఖీచేసి, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, వసతిగృహాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఆరోగ్యకేంద్రంలో సిబ్బంది హాజరు, అవుట్ పేషంటు విభాగం, మందులు తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలను గూర్చి రోగులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో హాస్టలు సిబ్బంది, వైద్యాధికారులు పాల్గొన్నారు.