Mar 11,2023 23:45

మాట్లాడుతున్న ఎంఇఒ ప్రసాద్‌

ప్రజాశక్తి- నక్కపల్లి:టెన్త్‌ పరీక్షలు పూర్తయ్యే వరకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంఈఓ డివిడి ప్రసాద్‌ సూచించారు. జిల్లా కలెక్టర్‌, విద్యాశాఖ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు శనివారం స్ధానిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్ధుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో పదిలో శాతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చి దిద్దుతున్నట్లు తెలిపారు.ఇప్పటికే పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలనే తపనతో ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రణాళికలను అమలు చేసి శతశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేస్తున్నారన్నారు. మెరిట్‌ విద్యార్థులతో పాటు చదువులో వెనుకబడిన విద్యార్థుల పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. పది మంది విద్యార్థులను ఒక ఉపాధ్యాయుడు దత్తత తీసుకుని ప్రత్యేక తరగతులు నిర్వహించి సబ్జెక్టుల వారిగా బోధన చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా వెనకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించడం జరిగిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సూచనల మేరకు తమ పిల్లలను ఇంటి వద్ద ప్రణాళిక బద్ధంగా చదివేలా చూడాలన్నారు.విద్యార్థులు కష్టపడి చదివితే తప్పనిసరిగా మెరుగైన ఫలితాలు సాధిస్తారన్నారు. పరీక్షలు ముగిసే వరకూ ఇళ్ళ వద్ద టీవీలకు, సెల్‌ ఫోన్‌లకు పిల్లలను దూరంగా ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ కర్రి పద్మ, వైస్‌ చైర్మన్‌ లోవ కన్నబాబు, ఉపాధ్యాయులు ఎన్‌.వి.ఎస్‌.ఆచార్యులు, టి.వి.రమణ, ఎన్‌.అప్పారావు, సత్యవతి, బాబూజీ, పాధ్యాయులు పాల్గొన్నారు.