తెలియని ఆంక్షలేవో
వాక్యం చుట్టూ సరిహద్దులు గీస్తాయి
పదాలను ఖైదు చేస్తాయి
ఎన్నో పగళ్ళను రాత్రులను పహరా పెట్టి
కొన్ని వాక్యాల కోసం
నేను గబ్బిలమై
హృదయం పట్టుకు వేళ్ళాడతాను
గుండె నలిగిన కాగితమై మెలిపెడుతున్నా
నెప్పిని భరిస్తూ
చీకటిని చీల్చే వెన్నెల వాక్యం కోసం
అవిశ్రాంతంగా వేటాడతాను
జీవితాలను వెలిగించి
నిలువెత్తు వృక్షమై నిలబెట్టే వాక్యం కోసం
ఎన్నో యుగాలు ప్రయాణిస్తాను
మరెన్నో రంగుల కలలు కంటారు
కనబడని దారాలతో
వెనక్కిలాగే
చేతల చేతుల రహస్య పద్మవ్యూహాలను
లాఘవంగా ఛేదించుకుని
ఒక వాక్యాన్ని చీరచెంగున ముడేసుకుంటాను
దానిని ఆలంబన చేసుకుని
మరి కొన్ని పూలతలు పెనవేసి
చెమట అలసటను తుడిచేసి
చిరునవ్వు వత్తికి కాంతిని అద్దుతాయి
వాక్యం అందరి హక్కు
దాన్ని చెక్కుతున్నపుడు
ఎన్ని బతుకుల కన్నీటి గాయాలు
మరెన్ని రక్తాక్షరాలు
గోడలను రాపాడతాయో
తెలుసా మీకు?
- పద్మావతి రాంభక్త
99663 07777