
విగ్రహ ఏర్పాటుకు రూ.50 వేలు అందిస్తా
జయంతి వేడుకల్లో ఆర్‌డిఒ దాసిరాజు
ప్రజాశక్తి - భీమవరం రూరల్
తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని ఆర్‌డిఒ దాసిరాజు అన్నారు. భీమవరం ప్రకాశం చౌక్‌లో ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమాన్ని జయంతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధశారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌డిఒ దాసిరాజు మాట్లాడుతూ భీమవరంలో ఏర్పాటుచేసే టంగుటూరి విగ్రహానికి తన వంతుగా రూ.50 వేలు అందిస్తానని తెలిపారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ దశాబ్దకాలంగా ఈ ప్రకాశం చౌక్‌లో ఆయన విగ్రహం నెలకొల్పాలని ప్రయత్నాలు చేస్తున్నామని, ఎంతోమంది దాతలు సహకరించారని, నేడు ఆర్‌డిఒ రూ.50 వేలు ఇస్తామని ప్రకటించడం తప్పక విగ్రహ ప్రతిష్ట జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడురోజులుగా నిర్వహిస్తున్న పోటీల్లో గెలుపొందిన 36 మందికి ప్రశంసాపత్రాలు, నిఘంటువులు అందించారు. ముందుగా క్విట్ ఇండియా స్థూపం నుంచి ప్రకాశం చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయంతి ఉత్సవ సభ్యులు కంతేటి వెంకటరాజు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, భట్టిప్రోలు శ్రీనివాస్, న్యాయవాది ఉండపల్లి రమేష్‌నాయుడు, ఇందుకూరి ప్రసాద్ రాజు, లయన్స్ క్లబ్ జోనల్ ఛైర్మన్ నందమూరి రాజేష్, ఉపాధ్యక్షులు నరహరశెట్టి కృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.
పాలకొల్లు : ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా బుధవారం పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్‌లో జాతీయ నాయకులకు నివాళులర్పించారు. పాలకొల్లు శ్రీ క్షీరారామ బ్రాహ్మణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు ఆంధ్రకేసరికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సోమంచి శ్రీనివాస్ శాస్త్రి మాట్లాడుతూ టంగుటూరి సుప్రసిద్ధ స్వాతంత్య్ర సమరయోధుడు, రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అని చెప్పారు. నేటి కాలంలో ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు చెరావూరి నరసింహమూర్తి, కార్యదర్శి నందుల దశరథ్, ట్రెజరర్ వెంకటేశ్వరరావు, సంఘం గౌరవ వ్యవస్థాపక అధ్యక్షులు సోమంచి శ్రీనివాస్‌శాస్త్రి, హరినారాయణ, నండూరి జానకిరామయ్య, యర్రమిల్లి నరసింహరావు, రమణకుమార్, శ్రీనివాస్, దేవరకొండ రామాంజనేయులు, తాతపూడి శర్మ, చాగంటి ప్రసాద్, నిడమర్తి బాలాజీ, రాయవరపు సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.
పెనుమంట్ర : మార్టేరు వ్యవసాయ పరిశోధనా స్థానంలో టంగుటూరి ప్రకాశంపంతులు చిత్రపటానికి పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎడిఆర్ డాక్టర్ ఎం.భరతలక్ష్మి మాట్లాడుతూ టంగుటూరి జీవితం విద్యార్థులకు ఆదర్శప్రాయమన్నారు. ఆయన జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. వ్యవసాయ పాలిటెక్నిక్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.రామభద్రరాజు మట్లాడుతూ మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పాలిటెక్నిక్ బోధన, బోధనేతర సిబ్బంది, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.