Nov 07,2023 22:03

వైసిపి, టిడిపి, జనసేన విధానాలపై గళమెత్తిన ప్రజారక్షణ బేరి
రాష్ట్రానికి బిజెపి తీవ్ర అన్యాయం
నరసాపురం సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు లోకనాథం
ప్రజాశక్తి - భీమవరం/యలమంచిలి/నరసాపురం
తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని వైసిపి, టిడిపి, జనసేన ఢిల్లీలో తాకట్టు పెట్టడం సిగ్గుచేటని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు లోకనాథం విమర్శించారు. సిపిఎం చేపట్టిన 'ప్రజారక్షణ భేరి' బస్సు యాత్ర మంగళవారం సాయంత్రం అంబేద్కర్‌ కోనసీమ జిల్లా నుంచి చించినాడ బ్రిడ్జి మీదుగా పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. చించినాడ, నరసాపురంలో సభలు నిర్వహించారు. నరసాపురంలో సభకు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కవురు పెద్దిరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా లోకనాధం మాట్లాడుతూ ప్రాంతాలు, రాష్ట్రాల మధ్య వ్యత్యాసం పెరుగుతుందని, ఈ నేపథ్యంలో అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ప్రజా ప్రణాళిక రూపొందించిందన్నారు. విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు నిధులు, వెనుకపడిన ప్రాంతాల అభివద్ధి, రాజధాని నిర్మాణం నిధులు కేటాయించలేదన్నారు. తొమ్మిదిన్నరేళ్ల బిజెపి పాలనలో ధరలు పెరిగాయని , ఉద్యోగావకాశాలు లేవని, ఆత్మహత్యలు పెరిగాయని , గిట్టుబాటు ధర అందట్లేదని అన్నారు. రాష్ట్ర హక్కులను హరిస్తున్నా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడకపోవడం దారుణమన్నారు. బటన్‌ నొక్కడం తప్ప అభివద్ధికి చర్యలు తీసుకోకుండా జగన్‌ ఓట్ల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. నరసాపురం ఎంపీ ఈ నియోజకవర్గ సమస్యలను పార్లమెంట్లో ఒక్కరోజూ ప్రస్తావించలేదని విమర్శించారు. విభజన హామీలు అమలు చేసినప్పుడే రాష్ట్రం సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని రాష్ట్ర కమిటీ సభ్యులు కె.ధనలక్ష్మి చెప్పారు. రాష్ట్రంలో మూడున్నర లక్షల స్కీం వర్కర్లుగా పనిచేస్తున్నారని, వీరికి కనీస వేతనం లేదన్నారు. నర్సాపురంలో అన్ని వనరులు అందుబాటులో ఉన్నాయని, అభివద్ధి మాత్రం శూన్యమని సిపిఎం రాష్ట్ర నాయకులు వై.రాము విమర్శించారు. వశిష్ట వారధి ఎన్నికల హామీగానే వస్తుందే తప్ప నిర్మాణం మాత్రం చేయలేదన్నారు. ఫిషింగ్‌ హార్బర్‌ లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం నిరంతరం పోరాడుతోందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బి.బలరాం చెప్పారు. రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. భవిష్యత్తులో రైతుల పక్షాన నిరంతర పోరాడతామన్నారు. కూలీలకు కనీస వేతనం అందట్లేదని, వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ ప్రాంతంలో వేల మంది మత్స్యకార కుటుంబాలు ఉన్నాయని, అయితే వేట నిషేధ సమయంలో కొంతమందికి మాత్రమే పరిహారం అందిస్తున్నారన్నారు. ఉద్యోగులు ఉపాధ్యాయులకు సిపిఎస్‌ రద్దు చేస్తామని చెప్పిన జగన్‌ హామీని అమలు చేయకుండా విస్మరించారని విమర్శించారు. జిల్లాను కాలుష్యం పట్టిపీడిస్తుందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా విజయవాడలో ఈ నెల 15న నిర్వహించబోయే బహిరంగ సభకు రావాలని కోరారు. ఈ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎవి.నాగేశ్వరరావు, రాష్ట్ర నేత కొల్లాటి శ్రీనివాస్‌, నేతలు దిగుపాటి రాజగోపాల్‌, ఎం.త్రిమూర్తులు, పొన్నాడ రాము, జల్లి రామ్మోహన్‌, యడ్ల చిట్టిబాబు, పొగాకు పూర్ణ, నారాయణరావు, తెలగంశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.