ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ : జిల్లాలోని అన్ని ప్రయివేటు సంస్థలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు వాటి నామ ఫలకాలను (బోర్డులను) మూడు నెలలులోగా తప్పని సరిగా తెలుగులో రాసేలా చర్యలు తీసుకో వాలని రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పోలీసు అధికారులకు సూచించారు. తెలుగులోనే ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలని అన్నారు. మంగళవారం ఉదయం ఆయన పోలీసు శాఖలో తెలుగు భాష అమలు తీరుపై పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర అధికార భాషా సంఘానికి పలు అధికారాలున్నాయని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తెలుగును వినియోగించడంలో కృషి సలపాలని కోరారు. విదేశాలలో తెలుగు వారు తెలుగు భాషను ఎంతగానో వాడుతున్నారని గుర్తు చేశారు. తెలుగు భాషా అభివృద్ధికి చరిత్రలో కృషి చేసిన మహనీయులు ఎందరో ఉన్నారని వివరించారు. పత్రికలు, ప్రసార మాధ్యమాలు తెలుగు అభివృద్ధికి కృషి చేయాలన్నారు. తెలుగు భాషోద్యమకారులను గౌరవించాలని, వారి కార్యక్రమాలకు చేయూతనివ్వాలని అన్నారు. తెలుగులో కార్యక్రమాలను, పద్య నాటకాలను నిర్వహించి తెలుగు భాష వినియోగం, అందులోని మాధుర్యాన్ని తెలుసుకోవాలని, ఆస్వాదించాలని సూచించారు. కంప్యూటర్లు, సెల్‌ఫోన్లులో తెలుగు ఫాంట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తెలుగులోనే చర్చించుకోవాలన్నారు. ఇ-పైలింగ్, ఇ-ఆఫీసులలో తెలుగును వినియోగించాలన్నారు.
నగర పోలీసు కమిషనర్ సిహెచ్.శ్రీకాంత్ మాట్లాడుతూ పోలీసు శాఖలో తెలుగు వినియోగాన్ని పెంచడానికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి తెలుగు వినియోగానికి చర్యలు చేపడతామన్నారు. వచ్చే మూడు నెలలలోగా దుకాణాలు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించి నామ ఫలకాలు, ఇతర బోర్డులు, ప్రచార సామగ్రి తెలుగు భాషలో ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డిసిపి సుమిత్ సునీల్ గరుడ్ మాట్లాడుతూ ఎపిపిఎస్‌సి నిర్వహించే తెలుగు భాషా పరీక్షకు సిద్ధం కావడానికి పుస్తకాలు, క్రాష్ కోర్సులు అవసరముందని యార్లగడ్డ దృష్టికి తీసుకొచ్చారు. తెలుగు అధికార భాషా సంఘం సభ్యుడు మీగడ రామలింగస్వామి తెలుగులో పలు పద్యాలను వినిపించి తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెప్పారు.










