ప్రజాశక్తి - ఎమ్మిగనూరు రూరల్
టిడిపి వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు ఎన్‌టి.రామారావు తెలుగు జాతి ఆత్మగౌరవమని టిడిపి నాయకులు తెలిపారు. సోమవారం స్థానిక కోట్ల క్యాంపు కార్యాలయంలో ఎన్‌టిఆర్ రూ.100 నాణెం గోడపత్రికను ప్రదర్శించారు. ఎన్‌టిఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిడిపి నేతలు మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లో తెలుగు జాతి ఖ్యాతిని చాటి చెప్పిన శకపురుషుడని కొనియాడారు. ఎన్‌టిఆర్ శత జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా రాష్ట్రపతి భవన్‌లో రూ.100 ఎన్‌టిఆర్ స్మారక నాణేన్ని విడుదల చేయడం హర్షణీయమని తెలిపారు. కాంగ్రెస్‌కు తిరుగులేని కాలంలో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో పార్టీని స్థాపించారని చెప్పారు. పార్టీలో పేద, బడుగు, బలహీన వర్గాలకు చోటు కల్పించి 9 నెలల్లో అధికారం చేపట్టారని తెలిపారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి ప్రతిపక్షాలను సంఘటితం చేసి నేషనల్ ఫ్రంట్ ద్వారా వీపీ.సింగ్‌ను ప్రధానమంత్రి గద్దెపై కూర్చోబెట్టిన ఘనత ఎన్‌టిఆర్‌కే దక్కిందన్నారు. టిడిపి నాయకులు కదిరికోట ఆదెన్న, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ డైరెక్టర్ జి.అల్తాఫ్, రాష్ట్ర ఉప్పర (సగర) ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ ఉప్పర ఆంజనేయులు, టిడిపి కురువ సాధికారిక కమిటీ కర్నూలు పార్లమెంట్ సభ్యులు, అడ్వకేట్ కెటి.మల్లికార్జున, ఎన్‌టిఆర్, ఎన్‌బికె ఫ్యాన్స్ సేవా సమితి పట్టణ అధ్యక్షులు రోజా ఆర్ట్స్ హుస్సేని, రుద్రాక్షల రంగన్న, టిడిపి ముస్లిం, మైనార్టీ నాయకులు కెఎమ్‌డి.అబ్దుల్ జబ్బార్, మేటీ వలీ బాష, గోరా బాష, మహబూబ్ బాష, ఆఫ్గాన్ వలీ బాష, టిడిపి ఎస్సీ సెల్ నాయకులు సప్లయర్స్ బంగారప్ప, కంపాడు చిన్న రంగన్న, పందికోన సురేష్, జాలవాడి ఏసన్న పాల్గొన్నారు.
ఎన్‌టిఆర్ సేవలు చిరస్మరణీయం : నాయకులు
ఎమ్మిగనూరు : తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి.రామారావు సేవలు చిరస్మరణీయమని నాయకులు తెలిపారు. నాణేన్ని విడుదల చేయడంతో పట్టణంలోని టిడిపి కార్యాలయంలో కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకునానరు. టిడిపి పట్టణ నాయకులు కొండయ్య చౌదరి, రంగస్వామి గౌడ్, కలీముల్లా, దయాసాగర్, రాందాస్ గౌడ్, తురేగల్ నజీర్ అహ్మద్ పాల్గొన్నారు.










