తెలుగుగంగలో నిలిచిన నీటి ప్రవాహం
- మరో తడి అందితేనే చేతికి పంటలు - ఆందోళనలో రైతులు
ప్రజాశక్తి - రుద్రవరం
తెలుగు గంగ ప్రధాన కాలువలో మంగళవారం నీటి ప్రవాహం నిలిచిపోయింది. దీంతో పంటలు సాగు చేసిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజుల క్రితం వెలుగోడు రిజర్వాయర్ నుంచి 2000 క్యూసెక్కుల నీరును గంగా అధికారులు వారాబందీ పద్ధతిలో విడుదల చేశారు. దీంతో రైతులు మొక్కజొన్న, మినుము, పత్తి, మిర్చి, వరి పంటలకు కాలువల ద్వారా నీరును పారించుకున్నారు. అయితే అధికారులు నీటిని నిలుపుదల చేయడంతో ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన పంటలకు అరకొరగా సాగునీరు అందింది. అలాగే ప్రధాన కాలువ ద్వారా చెరువులకు నీరు పూర్తిగా అందకపోవడంతో చెరువు కింద పంటలు సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలుగంగ ప్రధాన కాలువ కింద పంటలు సాగు చేసిన రైతులకు నీరు నిలిచిపోవడంతో దిక్కుతోచని స్థితిలో కాలువల్లో ఆయిల్ ఇంజన్లు వేసి పంటలకు నీరు పెట్టుకుంటున్నారు. సాగు చేసిన పంటలకు మరో మారు నీరు పెడితే పంటలు పూర్తిగా పండే అవకాశం ఉందని, తెలుగుగంగ అధికారులు రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మరోమారు సాగునీరు విడుదల చేసి ఆదుకోవాలని రుద్రవరం మండల రైతులు కోరుతున్నారు.










