ప్రజాశక్తి-వేపగుంట, విశాఖ
తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన వర్గాల అభివృద్ధి ప్రారంభమైందని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంట సమీపంలోని మీనాక్షి కన్వెన్షన్ హాల్లో, గురువారం ఉదయం బీసీలు, మత్స్యకారులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఒకప్పుడు వెనుకబడిన వర్గాలను పట్టించుకోని పరిస్థితి ఉండేదని, కేవలం కుల వృత్తుల మీద జీవనోపాధి చేసేవారని తెలిపారు. సముద్రంలోకి పోతే తిరిగి వస్తారో లేదో తెలియని పరిస్థితి మత్స్యకారులదని, తెలుగుదేశం పార్టీ హయాంలో వారి ప్రాణాలను కాపాడే టెక్నాలజిని తీసుకొచ్చామని తెలిపారు. మత్స్యకారుల పిల్లల కోసం తెలుగుదేశం పార్టీ హయాంలో 9 రెసిడెన్సియల్ స్కూల్స్ ఏర్పాటుచేశామని చెప్పారు. హుదూద్ తుపాను సమయంలో మత్స్యకారులకు ఎక్కువ బెనిఫిట్స్ కల్పించామన్నారు. పడవలు, బొట్లు డీజిల్‌కి ఎక్కువ రాయితీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీయేనని స్పష్టం చేశారు. బోట్లు ధ్వంసం అయితే రూ.6 లక్షల పరిహారం ఇచ్చామని గుర్తు చేశారు. చేపలను పెంచుకునేవారికి ఆర్థికసాయం చేసి ఆదుకున్నామన్నారు.
ఆనాడు ఒక మంచి ఉద్దేశంతో ఫార్మాసిటీ ఏర్పాటుచేస్తే, నేడు అందులో పనిచేస్తున్న వారికి అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాక ముందు తలనిమిరాడు, ముద్దులు పెట్టాడు.. ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడని జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు ఎద్దేవా చేశారు. టిడ్కో బాధితుల సమస్యలు విని టిడిపి అధికారంలోకి రాగానే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు బండారు సత్యనారాయణమూర్తి, కొల్లు రవీంద్ర, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, శ్రీభరత్ పాల్గొన్నారు.










