తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే సంక్షేమానికి నాంది
శ్రీశైలం దేవస్థానం మాజీ చైర్మన్ వంగాల శివ రామిరెడ్డి
ప్రజాశక్తి - ఆత్మకూర్
సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో అన్న నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీది ఘనమైన చరిత్ర అని శ్రీశైలం దేవస్థానం మాజీ చైర్మన్ వంగాల శివ రామిరెడ్డి, ప్రముఖ న్యాయవాది కంచర్ల గోవింద రెడ్డి లు అన్నారు. బుధవారం 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నందు ఘనంగా సంబరాలు నిర్వహించారు. అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు, అనంతరం జెండా ఎగురవేసి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ రాజకీయ రంగంలోకి తారాజువ్వలా దూసుకువచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే తెలుగు బావుటాను ఎగురవేసిన యుగపురుషుడు నందమూరి తారక రామారావు అని, పేదల జీవితాలకు పెన్నిధిగా, అన్నదాతలకు ఆశాదీపంగా, ఆడపడుచులకు అన్నగా, బడుగుల సంక్షేమానికి వినూత్న పథకాలెన్నో తెచ్చిందన్నారు. శ్రీశైలం నియోజకవర్గం లో నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో మాజీ ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి , బుడ్డా కుటుంబం చేసిన అభివృద్ధి తప్ప, మరే అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. తెలుగుజాతికి మార్గదర్శం చేసి, రాష్ట్ర ప్రగతి, ప్రజారంజక పాలన చేసిన మహానాయకుడు ఎన్టీఆర్, నీతివంతమైన రాజకీయాలతో దేశంలోనే ప్రాంతీయ పార్టీ లకు సముచిత గౌరవాన్ని, భాగస్వామ్యాన్ని కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశమన్నారు. ఫెడరల్ వ్యవస్థను, రాజ్యాంగ స్ఫూర్తిని ఘోరంగా దెబ్బ తీశారు. అలాంటి పరిస్థితుల్లో తెలుగు దేశం ఆవిర్భావం ఓ ప్రభంజనం సృష్టించిందని.. నేడు మళ్ళీ జగన్ రాజా రెడ్డి రాజ్యాంగ నియంత పాలనకు అంతం పలికేందుకు ప్రజలు తెలుగుదేశాన్ని ఆశీర్వదించి మాద్దత్తు తెలుపుతున్నానని, రాబోయే ఎన్నికల్లో టిడిపి ప్రభంజనం సృష్టించబోతుందని, శ్రీశైలం నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఘన విజయం సాధించబోతున్నరని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షల మేరకు పార్టీ ప్రణాళికను రూపొందించి.. 4 దశాబ్దాలుగా పేదరికం నిర్మూలన, బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని అన్నారు. పేదల సంక్షేమం కోసం పనిచేసిన స్వర్గీయ ఎన్టీఆర్ గారికి భారత రత్న ఇచ్చి గౌరవించడం తెలుగు ప్రజలకే కాదు భారత పౌరులందరికి గర్వ కారణమని యుగపురుషునికి భారత రత్న కోసం తెలుగుదేశం పార్టీ కృషిచేస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శివ ప్రసాద్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్లాపురం బాషా, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి నాఘుర్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు సి.కలిముల్లా, జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి గిరి రాజు, బి.సి సెల్ రాష్ట్ర సాధికార కమిటీ సభ్యులు రమేష్ గౌడ్ లతో పాటు నాయకులు పెద్ద స్వామి రెడ్డి, పుల్లా రెడ్డి, వెంకట్రావ్, యం.రామకృష్ణ, రమూర్తి, ఫకృద్దిన్, వెంకటేశ్వర్లు, లక్ష్మి దేవి, సరోజ, మురళి, సతీష్, శరత్ తదితరులు పాల్గొన్నారు.










