వీరఘట్టం :మండలంలోని విక్రంపురం వద్ద బుధవారం ప్రారంభించిన భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్రలో టిడిపి నాయకుల మధ్య ఉన్న గ్రూపుల పోరు బయటపడింది. సాక్ష్యత్తూ టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళావెంకట్రావు సమక్షంలోనే తెలుగుతమ్ముళ్ల తోపులాట చోటు చేసుంది. బస్సు ఎక్కుతున్న సమయంలో నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ గ్రూపునకు చెందిన మండల అధ్యక్షులు ఉదయాన ఉదయభాస్కర్, పొదిలాపు కృష్ణమూర్తినాయుడు, జామి లక్ష్మీనారా యణ, పొన్నాడ నాగేశ్వరరావు, గొర్లె గౌరునాయుడు, పడాల భూదేవి గ్రూపునకు చెందినకందాపు వెంకటరమణ, వారాడ సుమంత్ నాయుడు, తదితరుల మధ్య మాటా మాట పెరగింది. దీంతో కొంతమంది బస్సు కదలడానికి వీల్లేదని, ఎక్కిన వారంతా కిందకు దిగాలంటూ నినాదాలు చేశారు. బస్సు కదలడానికి వీల్లేదని ఒక గ్రూపు వారు అనగా, మీరెవరు చెప్పడానికంటూ తెలుగు తమ్ముళ్ల మధ్య తోపులాట జరిగింది. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై ఎం.వెంకటరమణ విక్రంపురానికి చేరుకున్నారు. ఇరు గ్రూపుల నాయకులను సముదాయించి, ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ఇదిలా ఉండగా, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గ్రూపులు వద్దు అంతా ఒకే తాటిపైన పనిచేయాలని ఇటీవల ఆదేశించినా, వాటి బేఖాతరు చేస్తూ వీధినపడడంతో తెలుగుతమ్ముళ్లు ముక్కున వేలేసుకుంటున్నారు.










