Mar 20,2023 00:14
ఉగాది వేడుకలలో సన్మాన గ్రహీతలు

ప్రజాశక్తి-చీరాల: తెలుగునాట ఉగాది పండుగ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అని గీర్వాణాంధ్ర సరస్వతి బిరుదాంకితులు, ఆజోవిభో కందాళం సంస్థ వ్యవస్థాపకులు అప్పాజోస్యుల సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం బత్తుల సర్వీసు ట్రస్టు చీరాల వారి ఆధ్వర్యంలో స్థానిక రోటరీ కమ్యూనిటీ హాలులో శోభకతి ఉగాది స్వాగత వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ రంగాలలో అంకిత భావనలతో సామాజిక సేవచేస్తున్న ప్రతిభావంతులకు ఉగాది పురస్కార సత్కారాలు అం దించారు. ఈ క్రమంలో ట్రస్ట్‌ అధ్యక్షులు బత్తుల బ్రహ్మారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన అప్పాజోస్యుల ఉగాది పండుగకు సంబంధించి ప్రత్యేకతలను వివరించారు. అలాగే విశిష్ట అతిథులుగా విచ్చేసిన డాక్టర్‌ గుంటుపల్లి సుబ్బారావు, డాక్టర్‌ కొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి, రొటేరియన్‌ వలివేటి మురళీకృష్ణ, వడలి రాధాకృష్ణ, గాదె హరిహరరావు ఉపన్యసించారు. చివరిగా ధర్మవరపు వెంకటరమణ, కోడూరి ఏకాంబరేశ్వరబాబు, దామర్ల బాపయ్య, భాగి కృష్ణమూర్తి, వడలి రాధాకృష్ణ, అల్లూరి శివకోటేశ్వరరావు, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.