తెలుగు సాహితీ వెలుగు గురజాడ
ప్రజాశక్తి-పాకాల: సాహిత్యాన్ని రాజులు రాజ ఆస్థానాల నుండి సామాన్య ప్రజల బాట పట్టించిన తెలుగు సాహిత్య వెలుగు గురజాడ అప్పారావు అని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ మొహిద్దిన్ బాష అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో గురువారం కళాశాలలో గురజాడ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవహారిక భాషా ఉద్యమంలో గిడుగు రామ్మూర్తి కి గురజాడ అండగా నిలిచారన్నారు. తెలుగు అధ్యాపకులు కె ఈశ్వర బాబు మాట్లాడుతూ కన్యాశుల్కం నాటకం రచన నేపథ్యం విశిష్ట ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించామన్నారు. బాల్య వివాహాలు, మూఢ నమ్మకాలు, స్త్రీ విద్య, వితంతు వివాహాలు, కుల వివక్ష వంటి విషయాలను సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకుని పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త గురజాడ అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ రమేష్ బాబు, వినోద్, విద్యార్థులు పాల్గొన్నారు.










